Janasena : జనసేనపై బీజేపీ ఆశలు అడియాశలే అవుతాయా.?

Janasena : ‘జనసేన పార్టీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం.. అధికార పీఠమెక్కుతాం..’ అంటోంది ఏపీ బీజేపీ. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలు పదే పదే ‘అధికారం మాదే..’ అంటూ చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు.

ఇంతకీ, జనసేన – బీజేపీ కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు.? ఈ ప్రశ్నకు మాత్రం బీజేపీ సరైన సమాధానం చెప్పడంలేదు. ‘పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు..’ అంటూ కొందరు బీజేపీ నేతలు గతంలో చెప్పినా, ఇప్పుడు ఆ స్పష్టత కనిపించడంలేదు.

ఇదిలా వుంటే, జనసేన పార్టీ 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా.? లేదా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ – బీజేపీలకు జనసేన మద్దతిచ్చింది. ఆ తర్వాత వామపక్షాలతో కలిసి రాజకీయాలు చేసింది జనసేన. 2019 ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసింది.

ఇలా ఎన్నికలకు ముందు ఓ పార్టీతో పొత్తు, ఎన్నికలయ్యాక ఇంకో పార్టీతో ఉద్యమాలు.. ఇలా నడుస్తుంటుంది జనసేన తీరు. రాజధాని అమరావతి సహా, ఏ అంశంలోనూ బీజేపీ, ఆంధ్రప్రదేశ్‌లో పోరాడాల్సిన స్థాయిలో పోరాడటంలేదు. పైగా, విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణ విషయంలో తగ్గదే లేదంటోంది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.

‘పార్టీ వేరు, ప్రభుత్వం వేరు..’ అంటూ కాకమ్మ కబుర్లు చెబుతున్న బీజేపీని ఏపీలో ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. బీజేపీతో కలిసి ముందుకు వెళితే, వచ్చే ఆ నాలుగైదు శాతం ఓట్లలోనూ కోత పడుతుందని నమ్మతున్న జనసేన, ముందు ముందు బీజేపీకి దూరమయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే, ఏపీలో బీజేపీ పరిస్థితేంటట.?