త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. వైసీపీ గెలుపు మీద ధీమాగా ఉండగా టీడీపీ ఎలాగైనా వైసీపీని పడగొట్టి నిలబడాలని చూస్తోంది. జనసేన – బీజేపీ కూటమి కూడ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అందరికంటే ముందుగా అభ్యర్థిని ఖరారు చేసి ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. గత ఎన్నికల్లో పనబాక లక్ష్మినే ఈసారి కూడ అభ్యర్థిగా నిలబెట్టారు ఆయన. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పెద్దగా పార్టీ పనుల్లో, నియోజకవర్గ వ్యవహారాల్లో పాలుపంచుకోలేదు ఓనబాక లక్ష్మి. దాదాపు అన్ని విషయాలకు దూరంగానే ఉంటూ వచ్చారు.
మొదట్లో బాబుగారు ఉప ఎన్నికల టికెట్ ఇస్తామన్నా ఆమె వద్దన్నట్టు వార్తలు వినబడ్డాయి. కానీ తిరుపతిలో ఆమెను మించిన అభ్యర్థి టీడీపీకి దొరకలేదు. అందుకే కష్టమో నష్టమో ఆమె మీదే బాధ్యతలు పెట్టారు బాబుగారు. మొదట్లో పనబాక లక్ష్మి పోటీకి వెనుకాడినా కూడ మంతనాలు, బుజ్జగింపులు, ప్రోత్సాహాలతో అయిష్టంగానే తలఊపారు. హైకమాండ్ బలవంతం మీద ఒప్పుకోనైతే ఒప్పుకున్నారు కానీ ఆమెలోని అయిష్టత అలాగే ఉన్నట్టుగా ఉంది. జనవరి నెలలోనే ప్రచారం మొదలుపెడతారని టీడీపీ నేతలు అన్నారు. కానీ ఇప్పటికీ ఆ ఊసే లేదు. పనబాక పెద్దగా బయటకు వస్తున్న దాఖలాలు లేవు.
తిరుపతిలో ఏ మూలాన కూడ ఆమె హడావుడి కనిపించట్లేదు. శ్రేణులు సైతం మీమాంసలోనే ఉండిపోయాయి. మధ్యలో చంద్రభాబు ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మను రంగంలోకి దింపారు. ఆయన టీమ్ కొన్నిరోజులు హడావుడి అయితే చేసింది కానీ మళ్ళీ సైలెంట్ అయిపోయింది. అధికార పార్టీని ఢీకొట్టడానికి ఇప్పటికీ ఒక వ్యూహం అంటూ తయారుచేసుకోలేదు పనబాక లక్ష్మి. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులు కూడ సమావేశాలు జరపట్లేదు. లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబడి ఓడిన నాయకులు ఎవ్వరిలోనూ పనబాక లక్ష్మిని గెలిపించుకుందామనే కసి కనిపించట్లేదు. అసలు పనబాకగారికే గెలవాలనే తపన లేనప్పుడు ఎవరేం చేస్తారు అనేవారు లేకపోలేదు. వారి మాటల్లోనూ నిజముంది. మొదటి నుండి ఆమె వైఖరి డౌట్ కొడుతూనే ఉంది. మరి ఎన్నికల నాటికి ఆమె షాకింగ్ న్యుస్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.