చీజ్ మాయలో పడుతున్నారా.. పిజ్జా స్లో పాయిజన్ అంట.. వైద్యులు చెప్పే నిజం ఇదే..!

చూడగానే నోరు ఊరే రుచి, తిన్న కొద్దీ ఇంకా తినాలనిపించే మాయ.. ఇదే పిజ్జా ప్రత్యేకత. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా పిజ్జా అంటే ఇష్టం. పార్టీలు, సెలబ్రేషన్లు, వీకెండ్‌ల్లో పిజ్జా లేకపోతే ఏదో మిస్ అయినట్టే. కానీ ఈ రుచికరమైన ఆహారం వెనక మనకు తెలియని అనారోగ్యం దాగి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడు తినడం ఓకే అయినా, తరచూ పిజ్జాను అలవాటుగా మార్చుకుంటే శరీరం మెల్లగా సమస్యల బాట పడుతుందని చెబుతున్నారు.

పిజ్జాలో ప్రధానంగా ఉపయోగించే మైదా, చీజ్, ప్రాసెస్డ్ టాపింగ్స్ శరీరానికి అవసరమైన పోషకాలకన్నా హానికరమైన అంశాలనే ఎక్కువగా అందిస్తాయి. ఒక సాధారణ పిజ్జా స్లైస్‌లోనే 300 నుంచి 400 క్యాలరీలు ఉంటాయి. అదే అలవాటుగా మారితే రోజువారీ అవసరానికి మించిన శక్తి శరీరంలో కొవ్వుగా పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరుగుదల మొదలై ఊబకాయం సమస్యగా మారుతుంది. ఇది డయాబెటిస్, గుండె జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక.

ఇంకో పెద్ద సమస్య సోడియం. పిజ్జాలో ఉండే ఉప్పు మోతాదు రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఒక్క స్లైస్‌తోనే రోజుకు తీసుకోవాల్సిన సోడియం పరిమితిలో సగం పూర్తవుతుంది. తరచూ ఇలా జరిగితే హైబీపీ, గుండెపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా చీజ్, పెప్పరోని, సాసేజ్ వంటి ప్రాసెస్డ్ టాపింగ్స్ ఇందుకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యం విషయానికి వస్తే పిజ్జా మరో హెచ్చరికగా మారుతోంది. ఇందులో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడేలా చేస్తాయి. దీర్ఘకాలంలో ఇది స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విదేశాల్లో జరిగిన అనేక అధ్యయనాలు కూడా పిజ్జా అధికంగా తినే వారిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాయి.

జీర్ణవ్యవస్థపైనా పిజ్జా ప్రభావం తీవ్రంగానే ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తరచూ ఎదురవుతాయి. పేగుల్లో ఆహారం ఎక్కువసేపు నిలిచిపోవడం వల్ల దీర్ఘకాలంలో పేగు సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ ప్రమాదం కూడా పిజ్జాతో ముడిపడి ఉంది. రిఫైన్డ్ ఫ్లోర్, సాస్‌లోని షుగర్స్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగి మళ్లీ పడిపోతాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు దారి తీస్తుంది. ఇప్పటికే షుగర్ ఉన్నవారు పిజ్జాను చాలా జాగ్రత్తగా తీసుకోవాలని నిపుణుల సూచన.

మరో ఆందోళన కలిగించే అంశం క్యాన్సర్ ప్రమాదం. ప్రాసెస్డ్ మీట్స్ ఉపయోగించిన పిజ్జాలను తరచూ తింటే పేగు, కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని WHO ఇప్పటికే హెచ్చరించింది. అందుకే తప్పనిసరిగా తినాలంటే వెజిటబుల్ టాపింగ్స్‌తో, గోధుమపిండి లేదా మిల్లెట్స్‌తో ఇంట్లో తయారు చేసిన పిజ్జానే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తానికి పిజ్జా రుచి కాసేపు ఆనందం ఇస్తే, అలవాటు ఆరోగ్యానికి దీర్ఘకాల భారం అవుతుంది. వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు మాత్రమే పరిమితంగా తీసుకోవడం మంచిదని నిపుణుల సలహా. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)