నాకు బాధ్యతలు అప్పగిస్తే, మీక్కావాల్సిన రీతిలో అరాచకాల్ని సృష్టిస్తాను..’ అంటూ ఓ రాజకీయ ప్రముఖుడు, తాను పనిచేస్తున్న రాజకీయ పార్టీకి బంపర్ ఆఫర్ ప్రకటించారట. రాజకీయాలంటే సేవ.. అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, ఇదేంటి.? ఈ అరాచకాలు సృష్టించడమేంటి.? అది కూడా తిరుపతి ఉప ఎన్నికల కోసం ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయా.? చూస్తోంటే, రాజకీయం అత్యంత పతన స్థాయికి దిగజారిపోయిందనిపిస్తోంది ఆంధ్రపదేశ్‌లో.
గెలవడం కోసం కాదు, రెండో స్థానం కోసమే ఈ అరాచకమంటూ అధికార వైసీపీకి చెందిన మీడియా సంస్థలో ఓ షాకింగ్ కథనం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుపతి వేదికగా లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం విదితమే. ఇంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో అరాచకాలు.. అది కూడా మత విధ్వేషాలు రగిల్చే కుట్రకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయన్న సమాచారం అధికార పార్టీకి చెందిన మీడియా వద్ద వుంటే, ఇంకో ఆలోచన లేకుండా ఆయా రాజకీయ పార్టీలకు నోటీసులు ఇచ్చి, అరాచకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నవారిని అరెస్టు చేసి తీరాలి. దురదృష్టవశాత్తూ ఇవి రాజకీయ ఆరోపణలు మాత్రమే. మీడియా కూడా రాజకీయ ఆరోపణలకు అలవాటు పడిపోయింది. లేకపోతే, ఇలాంటి కథనాలు ఎందుకు వస్తాయి.?
ఓ సమాచారం మీడియాకి అందితే, అది మత విధ్వేషాలకు కారణమయ్యే ప్రమాదం వుందని తెలిస్తే.. మీడియా గురుతరబాధ్యతగా అందుకు సంబంధించిన సమాచారాన్ని, ఆధారాల్ని పోలీసులకు అందివ్వాలి. లేదూ, తమ పార్టీకి మేలు కలిగేలా వ్యవహరించాలనుకుంటే.. తమ పార్టీనే ప్రభుత్వంలో వుంది గనుక, ఆ రకంగానూ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసి వుండాలి. తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు అవకాశాలు వైసీపీకే ఎక్కువ. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ, ఎక్కడో చిన్న భయం వైసీపీకి వున్నట్లుంది. అందుకే, ఈ తరహా ప్రచారాలకు తెరలేపుతోందన్నది సర్వ్రతా విన్పిస్తోన్న విమర్శ. రాజకీయ అవసరాల కోసం స్థానికంగా సున్నితమైన అంశాల్ని రెచ్చగొట్టడం రాజకీయ పార్టీలకు కొత్తేమీ కాదుగానీ, మరీ ఇంతలా రాజకీయ పార్టీలు బరితెగిస్తాయా.? తిరుపతి ప్రశాంతతను దెబ్బకొట్టాలనుకుంటాయా.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.