నిన్న పోలవరం, నేడు కాళేశ్వరం.! కేంద్రం నుంచి అదే షాక్.!

kaleshwaram

పోలవరం ప్రాజెక్టు విషయమై కేంద్రం పెద్ద షాక్ ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని తేల్చేసింది. 2019 నుంచి పనులు నత్త నడకన సాగుతున్నాయంటూ, రివర్స్ టెండరింగ్ అంశాన్నీ సాకుగా చూపింది కేంద్రం.

వరదల వల్ల కాఫర్ డ్యామ్‌కి నష్టం వాటిల్లిందనీ సెలవచ్చింది కేంద్రం. దాంతో, పోలవరం ప్రాజెక్టు కథ మళ్ళీ మొదటికి వచ్చింది. 2024 లోపు పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టతనిచ్చేసింది. అంటే, ఈలోగా కేంద్రం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇచ్చే అవకాశం లేదన్నమాట.

పోలవరం పరిస్థితి ఇలా వుంటే, కాళేశ్వరం ప్రాజెక్టుకీ తాజాగా షాక్ ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. అయితే, జాతీయ హోదా అర్హత కాళేశ్వరం ప్రాజెక్టుకి లేదనీ, ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఖర్చు వ్యవహారాలపై స్పష్టత లేదని కేంద్రం చెప్పడం గమనార్హం.

అంటే, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సమ అన్యాయం చేస్తోందన్నమాట. పార్లమెంటు వేదికగా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రశ్నలు సంధించడం, వాటికి కేంద్రం ‘లేదు, కాదు..’ అనడం సర్వసాధారణమైపోయింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలోనే కేంద్రం పట్టించుకోనప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టుకి కేంద్రమెలా తీపి కబురు చెబుతుంది.. అత్యాశ కాకపోతే.?

తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఏకతాటిపై వుంటే, కేంద్రాన్ని నిలదీసే ఆస్కారం వుంటుంది.కానీ, ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో లేదు.