BJP And Jansena : ‘బీజేపీ – జనసేన’ రోడ్ మ్యాప్ రెడీ.! కానీ, కార్యాచరణ ఎప్పుడో.!

BJP And Jansena : జనసేన పార్టీకి ఇవ్వాల్సిన రోడ్ మ్యాప్ సిద్ధంగానే వుంది.. ఎప్పుడు దాన్ని ఇవ్వాలో అప్పుడే ఇస్తాం. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఆలోచన లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండాలంటే, టీడీపీనే ముందుకు రావాలి.. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీనే మద్దతివ్వాలి..

ఆంద్రప్రదేశ్ బీజేపీ ఆలోచనలు ఇవీ.! కొద్ది రోజుల క్రితమే, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తమ మిత్రపక్షం బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘కొత్తగా ఇచ్చేదేముంది.? ఆల్రెడీ ఇచ్చేశాం..’ అంటూ తొందరపడి ముందే వ్యాఖ్యానించేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

‘ఇవ్వాల్సింది ఏపీ బీజేపీ కాదు.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ఆ రోడ్ మ్యాప్ ఖరారు చేయాలి..’ అంటూ జనసేన నాయకులు కొందరు ఘాటైన వ్యాఖ్యలే చేశారు. దాంతో, అధిష్టానం నుంచి మొట్టికాయలు పడ్డాయేమోగానీ, సోము వీర్రాజు మాటల్లో మార్పు వచ్చింది.

పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అనీ, ఆ విషయం ఎప్పుడో చెప్పేశామనీ, వైసీపీని అధికారంలోంచి దించడమే తమ లక్ష్యమనీ, సరైన సమయంలో సరైన విధంగా కేంద్రం, రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక పాలనపై స్పందిస్తుందనీ సోము వీర్రాజు తాజాగా వ్యాఖ్యానించారు.

మిత్రపక్షాల మధ్య అభిప్రాయ బేధాల గురించి ప్రశ్నిస్తే, అదంతా మీడియా సృష్టి మాత్రమేనని తెగేసి చెప్పారు సోము వీర్రాజు. అయితే, ఏపీ బీజేపీలోని వైసీపీ, టీడీపీ సానుభూతిపరుల కారణంగా ఏపీ బీజేపీకి సరైన రాజకీయ చిత్తశుద్ధి అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.

కాగా, బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ తర్వాత జనసేన ఆలోచనల్ని తెలియజేయాల్సి వుంటుంది. ఆ తర్వాతే ఉమ్మడి రోడ్ మ్యాప్ అనేది ఖరారవుతుంది. అంటే, ఈ ప్రక్రియ కొనసాగుతూనే వుందని అనుకోవాలేమో.