మంత్రి కేటీయార్‌కి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

‘మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు కదా.. చేతనైతే ఎంపీ పదవికి రాజీనామా చేసి, మల్లారెడ్డి మీద పోటీ చేసి గెలవాలి..’ అంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఉచిత సలహా ఇచ్చేశారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీయార్. ఈ ఉచిత సలహాపై తనదైన స్టయిల్లో రేవంత్ రెడ్డి స్పందించారు. ‘మంత్రి మల్లారెడ్డి అల్లుడి మీదనే నేను గెలిచాను.. ఇప్పుడు మళ్ళీ మల్లారెడ్డి మీద గెలవాల్సిన అవసరమేముంది.? రేంజ్ పెరిగింది.. కేసీయార్ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళితే.. ఎవరి సత్తా ఏంటో తెలిసిపోతుంది..’ అంటూ రేవంత్ రెడ్డి బదులిచ్చారు. ఇప్పుడిక తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎలాంటి రిటార్ట్ వుంటుందోగానీ.. రాజీనామా సవాళ్ళతో అనూహ్యంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే ఇంతలా రాజకీయం వేడెక్కుతోన్న విషయం విదితమే. ఇదిలా వుంటే, మంత్రి మల్లారెడ్డి అవినీతిపై ఆధారాలు సమర్పించినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర సమితి ఇరకాటంలో పడుతోంది కూడా. ఈటెల రాజేందర్ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలోనే ఆయన్ని మంత్రి పదవి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తొలగించిన విషయం విదితమే. మరి, మల్లారెడ్డి విషయంలో ఆ ఈక్వేషన్ ఎందుకు అప్లయ్ చేయడంలేదన్న చర్చ తెలంగాణ సమాజంలో జరుగుతోంది. ఇదిలా వుంటే, రేవంత్ రెడ్డిని చంద్రబాబు బినామీగా అభివర్ణించారు మంత్రి కేటీయార్. ‘చిలక మనదే.. కానీ, పలుకు మనది కాదు..’ అంటూ రేవంత్ రెడ్డి మీద సెటైర్లు పేల్చారు కేటీయార్. ఇంతకీ, ఈటెల రాజేందర్ విషయంలో చూపిన శ్రద్ధ, బాద్యత.. మంత్రి మల్లారెడ్డి విషయంలో కేసీయార్ ఎందుకు చూపించడంలేదట.? మల్లారెడ్డి అవినీతికి పాల్పడలేదని కేసీయార్ అంత గట్టిగా నమ్మడం వెనుక కారణమేంటట.?