ఏపీలో రాజ్యసభ ఎన్నికలు: ఎవరికి దక్కేను ఆ నాలుగు.?

Rajya Sabha Polls  : రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతాయి. వీటిల్లో 4 ఆంధ్రప్రదేశ్‌కి చెందినవి కాగా, రెండు తెలంగాణకి చెందినవి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ నేత సురేష్ ప్రభు పదవీ కాలం ముగిసింది.

బీజేపీ – టీడీపీ మధ్య స్నేహం వున్నప్పుడు, ఏపీ నుంచి సురేష్‌ ప్రభుకి టీడీపీనే రాజ్యసభ సీటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక, 2019 ఎన్నికల తర్వాత అనూహ్యంగా సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ టీడీపీని వీడి బీజేపీలోకి చేరిపోయారు.

ఖాళీ అయిన మొత్తం నాలుగు స్థానాలూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కనున్నాయి. ఆ పార్టీకి అసెంబ్లీలో వున్న బలం ఆధారంగా చూసుకుంటే, వేరే మద్దతుతో పని లేకుండా సొంతంగా.. ఏకగ్రీవంగా నాలుగు రాజ్యసభ స్థానాల్ని వైసీపీ దక్కించుకుంటుంది.

అయితే, గతంలో ఓ రాజ్యసభ సీటుని, వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తికి.. బీజేపీ కోటాలో ఇచ్చేసిన వైసీపీ, ఇప్పుడు కూడా అదే బాటలో ఓ సీటుని బీజేపీ కోటాలో ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. మరో సీటుని, తెలంగాణ రాష్ట్ర సమితి కోటాలో ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది.

తెలంగాణ నుంచి ఓ ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ తరఫున రాజ్యసభ సీటు ఆశిస్తున్నారట. ఇప్పటికే ఈ విషయమై ‘మాటలు’ సానుకూలంగా జరిగాయని అంటున్నారు. అయితే, వైసీపీ మాత్రం ఇంకా ఈ విషయమై పెదవి విప్పకపోవడం గమనార్హం.