ప్రభుత్వంపై నిందారోపణలు చేశారనీ, సమాజంలో అలజడి రేపేందుకు కుట్రపూరిత వ్యాఖ్యలు చేశారని అభియోగాలు మోపుతూ ఎంపీ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ, ఆయన్ని గుంటూరు జిల్లా జైలుకి తరలించింది. అంతకు ముందు కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రఘురామకు ప్రత్యేక వైద్య పరీక్షలు జరిగాయి. పరీక్షల అనంతరం గుంటూరు జైలుకు రఘురామను తరలించగా, అక్కడ ఆయనకు ఖైదీ నెంబర్ 3468 కేటాయించారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.. ‘రఘురామకృష్ణ.. ఖైదీ నెంబర్ 3468’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. బోల్డన్నీ మీమ్స్ కూడా షురూ అయ్యాయి.
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టయినప్పుడూ ఇదే పరిస్థితి. ఇప్పటికీ ఖైదీ నెంబర్ 6093.. అంటూ వైఎస్ జగన్ మీద టీడీపీ సహా వివిధ పార్టీలకు చెందిన మద్దతుదారులు సెటైర్లు వేస్తుండడం చూస్తున్నాం. కాగా, రఘురామ అరెస్ట్ తర్వాత హైడ్రామా నెలకొన్న విషయం విదితమే. తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ అప్లయ్ చేశారన్నది రఘురామ ఆరోపణ. ఈ వ్యవహారంపై న్యాయస్థానం ఇప్పటికే సీరియస్ అయ్యింది. రఘురామ ఆరోపణలు నిజమని తేలితే, తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించిన విషయం విదితమే. మరోపక్క, రఘురామ తనయుడు లోక్ సభ స్పీకర్ కి కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. అయితే, అసలు రఘురామకు ఎలా గాయాలయ్యాయి.? అన్నదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రేపు ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది. ఈలోగా రఘురామ పేరు ప్రస్తావించకుండా ఖైదీ నెంబర్ 3468.. పేరుతో సెటైర్లు, మీమ్స్ పడిపోతున్నాయి సోషల్ మీడియాలో.