AP: హోం మంత్రి పదవిపై కన్నేసిన రఘురామకృష్ణ.. ప్రతీకారం తీర్చుకోవటం కోసమే పదవా?

AP: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్న రఘురామ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఈయన గత ఎన్నికలలో వైసిపి ప్రభుత్వం తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు కానీ ఎంపీగా కొనసాగుతూనే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో గత ప్రభుత్వం ఈయనపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవడమే కాకుండా తనని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రఘురామకృష్ణం రాజు గత ఎన్నికల సమయంలో బిజెపిలోకి వెళ్లి విజయం సాధించి కేంద్ర మంత్రిగా కొనసాగాలని భావించారు కానీ ఆశ తీరలేదు.

ఈ క్రమంలోనే చివరి నిమిషంలో ఈయన ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే కచ్చితంగా ఈయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఊహించని విధంగా రఘురామకృష్ణం రాజుకు డిప్యూటీ స్పీకర్గా పదవి కట్టబెట్టారు. ఇకపోతే తాజాగా ఈయన అమెరికాలో నిర్వహించిన తానాసభలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజుకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

ప్రస్తుతం మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగుతున్నారు అయితే మీకు కనుక మంత్రి పదవి ఇస్తే ఏ శాఖలు కోరుకుంటారనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు రఘురామ కృష్ణంరాజు సమాధానం చెబుతూ తనకు రెండు మంత్రి పదవులు కావాలనే కోరిక ఉంది అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఒకటి హోంశాఖగా తాను ఎనిమిది గంటల పాటు అధికారం తీసుకుంటే చాలు గతంలో తనకు ఎదురైన రక్తధారకు కారణమైన ఘటనలపై దర్యాప్తు చేయిస్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద రెడ్ బుక్ లేదని.. అది వేరే వారి వద్ద ఉందని.. తన వద్ద ఉన్నది బ్లడ్ బుక్ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే మరో రెండు గంటల పాటు వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు ఇవ్వాలని కోరారు. ఇలా ఈయన ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మంత్రి పదవి అడుగుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.