గోదావరి కేంద్రంగా రాజకీయం మారుతున్న వేళ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను 2019 ఎన్నికల్లో ఓడించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా భీమవరం డీఎస్పీ జయసూర్య పైన పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయడం, దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన గ్రంధి శ్రీనివాస్, తాను పవన్‌ను కలిసి భీమవరంలోని అసలు గుట్టు విప్పుతానని ప్రకటించారు.
‘అపాయింట్‌మెంట్ ఇస్తే అన్నీ బయటపెడతా’: భీమవరంలో పేకాట నిర్వహణపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షనీయమన్న గ్రంధి, తాను పవన్‌ను కలిసి అన్ని విషయాలు చెప్పాలని ఉందని, తనకు అపాయింట్‌మెంట్ ఇస్తే వివరాలన్నీ బయట పెడతానని తెలిపారు. భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా ఆయన స్పందించారు.

‘రఘురామ చెప్పింది నిజమే, పోలీస్ అధికారిని టార్గెట్ చేశారు’: డీఎస్పీ జయసూర్య విషయంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. భీమవరంలో 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్ళు, రెండు నెలలుగా ఆదాయం రాకపోవడంతో ఆ పోలీస్ అధికారిని టార్గెట్ చేశారని ఆరోపించారు. పోలీస్ అధికారి పేకాట ఎప్పుడు ఆపారో, అప్పుడు వాళ్లకు వ్యతిరేకం అయ్యారని, రెండు నెలలుగా పేకాట ఆపారని గ్రంధి వివరించారు.
అధికార కూటమిపై తీవ్ర ఆరోపణలు: కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత 14 నెలలు పేకాట జరిగిందని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. ప్రజాప్రతినిధి, అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి రూ.10 లక్షలు, ఒక్కో బ్రాందీ షాపు నుండి నెలకు రూ.4.5 లక్షలు తీసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు స్థానికంగా రాజకీయ వేడిని పెంచాయి. గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలతో భీమవరం రాజకీయం మరింత రసకందాయంలో పడింది. ఆయన పవన్ కళ్యాణ్‌ను కలవడం, గుట్టు విప్పడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

