రాజద్రోహం కేసులో అరెస్టయ్యాక రఘురామకృష్ణరాజు పేరు తెలుగునాట రాజకీయాల్లో మార్మోగిపోయింది. కానీ, ఆ తర్వాతే అనూహ్యంగా ఆయన్ని ఎవరూ పట్టించుకోవడంలేదు. టీడీపీ అనుకూల మీడియా కూడా ఆయన్ని భుజాన మోసుకు తిరగడం మానేసింది. చాలా అరుదుగా మాత్రమే ఆయనకు టీడీపీ అనుకూల మీడియాలో ‘స్పేస్’ దక్కుతోంది. రచ్చబండ లాంటి వ్యవహారాలు నడుస్తున్నా, వాటికి అస్సలు ప్రాముఖ్యత దక్కడంలేదు తెలుగు మీడియాలో. సోషల్ మీడియాలో అక్కడక్కడా మాత్రమే రఘురామ పేరు వినిపిస్తోంది. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించిన రఘురామ, ఏం సాధించారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. రఘురామ మాత్రం, ఈ వ్యవహారాలపై చాలా ధీమాగా వున్నారు. మీడియాలో కనిపించేందుకు ఏ అవకాశం దక్కినా దాన్ని ఆయన వదులుకోవడంలేదు.
అదే సమయంలో ఆయన మాట తీరు అస్సలేమాత్రం మారలేదు. రఘురామ మారినా, మారకపోయినా.. ఆయన ఇమేజ్ అయితే దారుణంగా డ్యామేజ్ అయిపోయింది. సోషల్ మీడియాలోనే ఆయన్ని ఎవరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. అతి త్వరలో ఆయన తన ఎంపీ పదవిని కోల్పోబోతున్నారని అధికార వైసీపీ గట్టిగా నమ్ముతోంది. కానీ, వైసీపీకి ఆ తీపి కబురు ఢిల్లీ నుంచి అందడం ఆలస్యమవుతూ వస్తుండడంతో, రఘురామ చెలరేగిపోవడం.. అనే ప్రక్రియను నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం మీదా, పార్టీ మీదా తనదైన స్టయిల్లో విమర్శలు చేయడం, నాయకుల మీద వెకిలి వ్యాఖ్యానాలు చేయడం.. ఇదంతా యధాతథంగా కొనసాగుతూనే వుంది. వైసీపీ నేతలు కూడా ఆయన్ని ఇదివరకటిలా పట్టించుకోవట్లేదు. పట్టించుకోవడం ద్వారా ఆయనకి అదనపు పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని అధిష్టానం వైసీపీ నేతలకు సూచించిందేమో.