ఇదెక్కడి చోద్యం.? అరెస్టు చేసిన వ్యక్తిని.. అందునా లోక్ సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ప్రముఖ రాజకీయ నాయకుడ్ని పోలీసులు కొట్టడమా.? నిజానికి, ఇది సాధ్యమయ్యే పని కాదు. కానీ, నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం తనను పోలీసులు కొట్టారంటూ తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయన కోర్టుకు కూడా తనను పోలీసులు కొట్టిన విషయాన్ని తెలియజేశారు. దాంతో, కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట ఏపీ సీఐడీ పోలీసుల మీద. అయితే, ఇదంతా రఘురామ మార్కు పొలిటికల్ డ్రామా.. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది. రాష్ట్రంలో గడచిన రెండేళ్ళలో చాలామంది రాజకీయ నాయకులు వివిధ కేసుల్లో అరెస్టయ్యారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అయితే ఏకంగా హత్య కేసులో అరెస్టయ్యారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ మెడికల్ స్కాంలో భాగంగా అరెస్ట్ చేశారు. అయితే, అప్పట్లో ఇంత తీవ్రస్థాయి ఆరోపణలు ఏపీ పోలీసుల మీద ఆయా నేతలు చేయలేదు. అచ్చెన్నాయుడి విషయంలో మాత్రం పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల, న్యాయస్థానం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. అప్పటికే ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగి వుండడంతో, శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి అమరావతి వరకూ కారులో తీసుకురావడం, ఈ క్రమంలో రక్త స్రావం కావడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అది వేరే వ్యవహారం. రఘురామకృష్ణరాజు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించే అవకాశం లేదనే అభిప్రాయమే ఎక్కువమందిలో వినిపిస్తోంది. కానీ, అరెస్టు చేసే క్రమంలో రఘురామను కారులో కుక్కేసిన వైనం.. వీడియోల్లో కనిపిస్తోంది. దాంతో, రఘురామపై నిజంగానే పోలీసులు విరుచుకుపడ్డారా.? అన్న అనుమానాలకైతే ఆస్కారం వుంది. రఘురామ ఈ పేరు చెప్పి, టాపిక్ డైవర్షన్ రాజకీయాలు నడపట్లేదు కదా.?