చంద్రబాబు మళ్ళీ జైలుకేనా.!? ఎన్నికలకు ముందరేనా.?

త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీతోపాటు, లోక్ సభకీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి ఆంధ్రప్రదేశ్‌లో. ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకుంటున్నాయి. తామే అధికారంలోకి వస్తామని టీడీపీ అంటోంది. వైనాట్ 175 అంటోంది టీడీపీ. జనసేన – టీడీపీ కలిసి పొత్తు పెట్టుకున్న దరిమిలా, ఈక్వేషన్ ఒకింత రసవత్తరంగా కనిపిస్తోంది.

సరిగ్గా ఇదే సమయంలో, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి షాక్ తగిలింది. ఇది అలాంటిలాంటి షాక్ కాదు, సుప్రీం షాక్.

17-ఎ చట్టాన్ని పాటించకుండా, తనను అక్రమంగా అరెస్టు చేశారనీ, ఈ కేసు చెల్లదనీ ‘క్వాష్ పిటిషన్’ దాఖలు చేశారు చంద్రబాబు, సుప్రీంకోర్టులో. నిన్ననే ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజానికి, క్వాష్ పట్ల సుప్రీం సానుకూలంగా స్పందిస్తుందనీ, కేసు కొట్టివేయబడుతుందని టీడీపీ భావించింది.

కానీ, విస్తృత ధర్మాసనానికి కేసుని రిఫర్ చేస్తూ, ద్విసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. దాంతో, చంద్రబాబుకి షాక్ తగిలినట్లయ్యింది. 17-ఎ వర్తింపు విషయమై ఇద్దరు న్యాయమూర్తులు పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఒకరేమో, అది చెల్లుతుందనీ, ఇంకొకరు చెల్లదనీ చెప్పడంతోనే ఈ సమస్య.

మరోపక్క, రేపో మాపో చంద్రబాబు అరెస్టవుతారంటూ వైసీపీ అను‘కుల’ మీడియా ప్రచారం చేస్తుండడం గమనార్హం. విస్తృత ధర్మాసనం ఏర్పాటు, కేసు విచారణ.. ఈ తతంగమంతా పూర్తయ్యేటప్పటికి, ఎన్నికల తంతు కూడా పూర్తయిపోవచ్చు.

ఈలోగా ఏపీ సీఐడీ ఒకింత చురుగ్గా వ్యవహరిస్తే, చంద్రబాబు మళ్ళీ జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. అదే గనుక జరిగితే, చంద్రబాబు జైల్లో వుండగానే, ఎన్నికలు పూర్తయిపోతాయన్నమాట.

ఈ కేసులో తొలుత బెయిల్ కోసం చంద్రబాబు కోర్టును ఆశ్రయించకపోవడమే, ఆయనకు శాపంగా మారిందన్నది టీడీపీ వర్గాల్లోనే జరుగుతున్న చర్చ.