మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మంత్రి పదవి పోయాక.. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై సన్నిహితులతో మంతనాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆయన్ని ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఇంకొందరు ఫోన్ ద్వారా, ఇతర మార్గాల్లో ఆయనకు సానుభూతి, సంఘీభావం ప్రకటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో కేసీఆర్ తర్వాత, ఆ స్థాయిలో ఈటెల రాజేందర్ ఉద్యమ నాయకుడనే గుర్తింపు తెచ్చుకున్న మాట వాస్తవం. కేసీఆర్ చుట్టూ వున్న అతి కొద్దిమంది నమ్మకస్తుల్లో ఆయనా ఒకరు. కాదు కాదు, ఆయనే అతి ముఖ్యమైన వ్యక్తి అంటారు చాలామంది. కానీ, గులాబీ బాస్ ఆగ్రహానికి గురై, మంత్రి పదవి పోగొట్టుకున్నారు ఈటెల రాజేందర్. అయితే, కేసీఆర్ ఇలా ఈటెలపై అసహనంతో రగలిగిపోవడానికి కారణమెవరు.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి మరోపక్క, ఈటెలతో సన్నిహిత సంబంధాలున్న కొందరు ఉద్యమ నాయకులు, ఇప్పడాయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో గులాబీ పార్టీని వీడేందుకూ వాళ్ళంతా సమాయత్తమవుతున్నరాట. అలాంటివారెవరన్నదానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఖచ్చితమైన సమాచారం వుందనీ, వాళ్ళందరిపైనా కేసీఆర్ ప్రత్యేక నిఘా పెట్టించారనీ అంటున్నారు. మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా ఈటెలను కలిశారు. ఈటెలతో తమకు బంధుత్వం వుందని చెబుతున్నారాయన. టీఆర్ఎస్ వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరి, ప్రస్తుతం బీజేపీతో మంతనాలు జరుపుతున్న విశ్వేశ్వర్ రెడ్డి, ఈటెలను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తన వెంట నడిచేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒకరిద్దరు మంత్రులు కూడా సిద్ధంగా వున్నారని ఈటెల తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట.