తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు మొదలైంది. మైనారిటీ కోటాలో కేబినెట్‌లో చోటు దక్కించుకున్న మహమ్మద్ అజారుద్దీన్ ఇప్పుడు తన మంత్రి పదవి నిలుస్తుందా..? లేక తప్పుకోవాల్సిందేనా..? అనే ప్రశ్నల మధ్య చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల బలంతో మంత్రి పదవి అందుకున్న అజారుద్దీన్, ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండానే కేబినెట్‌లోకి రావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పుడు అదే పదవి ఆయనకు గండంగా మారుతోంది.
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే కాని వ్యక్తి మంత్రి అయితే, ఆరు నెలల లోపు తప్పనిసరిగా ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావాలి. అజారుద్దీన్ మంత్రి పదవి స్వీకరించి ఇప్పటికే రెండు నెలలు పూర్తయ్యాయి. అంటే మరో నాలుగు నెలల్లో ఆయన ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టాల్సిందే. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తే ఆ మార్గం అంత సులభంగా కనిపించడం లేదు.
ఇక్కడే గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వ్యవహారం కీలకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఇద్దరు నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయగా, ఆ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. చివరకు కోర్టు ఆ నియామకాలను రద్దు చేయడంతో కొత్తగా అజారుద్దీన్ పేరును చేర్చి మళ్లీ ప్రభుత్వం నామినేషన్ చేసింది. అయితే ఈ నియామకాలపై ఇప్పటివరకు సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇదే అజారుద్దీన్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారింది.
ఇక మరో సమస్య ఏమిటంటే.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది నవంబర్ వరకు ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా ఖాళీ కాకపోవచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అజారుద్దీన్‌ను చట్టసభలకు పంపే మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యను ఎలా డీల్ చేస్తుందన్నదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అజారుద్దీన్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వస్తే సమస్య తీరిపోతుంది. కానీ తీర్పు ఆలస్యమైతే లేదా ప్రతికూలంగా వస్తే మాత్రం ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో మరో అసాధ్యమైన ఆప్షన్‌పై కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లోని ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసి అజారుద్దీన్‌కు అవకాశం ఇవ్వాలన్నది. కానీ కాంగ్రెస్‌లో పదవి దక్కడం ఎంత కష్టమో, దాన్ని వదులుకోవడం అంతకంటే అసాధ్యమన్నది రాజకీయ వాస్తవం.
ఇంకో వైపు ఇదే గవర్నర్ కోటా వ్యవహారంలో ఎదురుచూస్తున్న కోదండరామ్ పరిస్థితి కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయనకు కూడా ఎప్పుడూ అవకాశం వస్తుందన్నది స్పష్టత లేకుండా పోయింది. ఒకరి పదవి నిలవాలంటే మరొకరి రాజకీయ భవితవ్యంపై ప్రభావం పడే పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి.. అజారుద్దీన్ మంత్రి పదవి ఇప్పుడు కాలంతో పరిగెత్తుతున్న రేస్‌లా మారింది. మరో నాలుగు నెలల్లో న్యాయస్థానం, రాజకీయ నిర్ణయాలు, పార్టీ వ్యూహాలు ఏ దిశగా వెళ్తాయన్నదే ఆయన భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతటి పరీక్షగా మారుతుందో చూడాలి.
