మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకటే వివాదం మరోసారి కలకలం రేపినది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్న సమయంలోనే మంత్రి తన మొబైల్‌లో రమ్మీ ఆడుతున్నట్లు చూపే వీడియో ఒక్కసారిగా బయటకు వచ్చి, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది. దీనితో విపక్షాలు ఆగ్రహంతో మండిపడుతున్నాయి.
రాష్ట్రంలో రైతులు నిత్యం ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండగా, వాటిని అడ్డుకోవాల్సిన వ్యవసాయ మంత్రి ఇలా రమ్మీ ఆడుతూ సేపు గడిపినట్లు చూపిస్తున్న వీడియో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలకు కారణమవుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సభలో ముఖ్య అంశాలను చర్చిస్తుండగా, వ్యవసాయ మంత్రి మాత్రం మొబైల్ స్క్రీన్ మీదే దృష్టి పెట్టి ఉండటాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
దీనిపై ఎన్‌సీపీ నేత రోహిత్ పవార్ ఘాటుగా స్పందిస్తూ రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారి.. రోజుకు ఎనిమిది మంది రైతులు బతుకులెత్తుతున్నారు. అయితే రైతులను ఆదుకోవాల్సిన వ్యవసాయ మంత్రికి అది పెద్దగా పట్టడం లేదు. రమ్మీకి సమయం దొరికినా రైతుల కష్టాల్ని చూసేందుకు సమయం దొరకడంలేదా?’’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై శివసేన కూడా సీరియస్ అయ్యింది. మంత్రి మాణిక్‌రావ్ కోకటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఇలా ప్రతిపక్షాలు ఒక్కటిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు మంత్రి మాత్రం తన మీద వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వివరణ ఇచ్చుకున్నారు. తాను అసెంబ్లీలో ఏమి జరుగుతోందో YouTubeలో చూడటానికి ఫోన్ తెరిచానని, అది రమ్మీ గేమ్‌కి లింకవుతోందని, తాను వెంటనే exit అవ్వాలని ప్రయత్నించానని చెప్పారు. పూర్తిగా వీడియో చూస్తే తనపై వస్తున్న ఆరోపణలు తప్పని తెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే మాణిక్‌రావ్ కోకటే ఇచ్చిన వివరణతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. రమ్మీ ఆడతారా? సభా కార్యక్రమాలు చూసుకుంటారా? అంటూ విమర్శలు ఎక్కుపెట్టాయి. మొత్తం మీద, ఈ రమ్మీ వీడియో మహారాష్ట్రలోని అధికారపక్షానికి మరోసారి ఇబ్బందులు తెచ్చిపెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
