ఏ ప్రభుత్వమైనా సరే.. రాష్ట్రంలో ముందుగా దృష్టి పెట్టాల్సిన విషయాలు రెండే ఒకటి విద్య.. రెండోది వైద్యం. నిజానికి ఈ రెండు సర్వీసులు. ఈ రెండింటిని ప్రభుత్వం ఉచితంగా అందించాలి. కానీ.. నేటి కార్పొరేట్ ప్రపంచంలో విద్య, వైద్యం రెండూ కార్పొరేట్ మయం అయిపోయాయి. ఈ రెండింటి కోసం సామాన్య జనాలు తమకు ఉన్నది కూడా అమ్ముకోవాల్సి వస్తోంది.
ఈ జనరేషన్ లో ఇంగ్లీష్ ప్రాధాన్యం ఎంత మేర ఉన్నదో అందరికీ తెలిసిందే. మాతృ భాషలో కన్నా ఆంగ్ల మీడియంలో చదివిన విద్యార్థులకే ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. తమ పిల్లలను మాతృ భాషలో కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారంటే దానికి కారణం వాళ్లకు తమ మాతృ భాష మీద మమకారం లేక కాదు. తమ పిల్లలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించాలని.
ఒక ప్రభుత్వం మాతృ భాషలోనే చదవాలి అంటుంది. ఇంకో ప్రభుత్వం వచ్చి మాతృ భాష కాదు ఇంగ్లీష్ మీడియం అంటుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీసం ఐదవ తరగతి వరకైనా పిల్లలు తమ మాతృ భాషలోనే చదవాలి అంటుంది. ఇలా ఒక్కొక్కరికి మీడియం చదువులపై ఒక్కో అభిప్రాయం ఉంది.
ప్రస్తుత కాలంలో చూసుకుంటే విద్య ఎంత పెద్ద వ్యాపారం అయిందో అందరం చూస్తూనే ఉన్నాం. విద్యను కార్పొరేట్ మయం చేశారు. దీంతో విద్యను లక్షలు పోసి కొనుక్కోవాల్సి వస్తోంది. అందులోనూ అందరి మైండ్లలో ఇంగ్లీష్ ను నింపేశారు. మాతృ భాషను తీసేశారు. కానీ.. నాణ్యమైన విద్య మాత్రం పిల్లలకు అందడం లేదు అనేది నగ్న సత్యం.
అందుకే.. ఏ ప్రభుత్వమైనా సరే.. ప్రజలకు అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని చెప్పడం మాత్రమే కాదు.. విద్య, వైద్యం.. ఈ రెండింటిని వ్యాపారం చేయకుండా ఆపగలిగితే చాలు. కార్పొరేట్ల చేతికి ఈ రెండింటిని చిక్కకుండా కాపాడగలిగితే చాలు.. నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం.. ఈ రెండు ప్రజలకు వద్దన్నా వచ్చి చేరుతాయి. మీడియంది ఏముంది.. కార్పొరేట్ బాధ పోతే.. పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో హాయిగా ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోగలరు. అది పెద్ద విషయమే కాదు. కానీ.. దానికి తగ్గట్టు సౌకర్యాలు కూడా ప్రభుత్వాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.