తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాదిలో తీవ్రమైన గడ్డు పరిస్థితుల్ని చూసిన నెల ఏదైనా ఉంది అంటే అది ఈఅక్టోబర్ నెలే అనాలి. అది కూడ ప్రకృతి రూపంలో ఆయనకు కష్టాలు తన్నుకొచ్చాయి. భారీ వర్షాల కారణంగా కేసీఆర్ వేసుకున్న రాజకీయ అంచనాలన్నీ తలకిందులైపోయాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ జనం తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇళ్ళు నీట ముంగి అనేక మంది నిరాశ్రయులు అయితే పదుల సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది. భారీ ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తక్షణమే పూనుకుని సహాయక చర్యలు చేపడుతున్నా, నష్ట పరిహాటం అందిస్తున్నా బాధిత ప్రజలు శాంతిచట్లేదు.
పరామర్శకు వెళ్లిన నేతల మీదకే తిరగబడుతున్నారు. ఇన్నేళ్ళలో ఏం బాగుచేశారు అంటూ దుమ్ము దులిపేస్తున్నారు. విశ్వనగరాన్ని నిర్లక్ష్యం చేసి విశ్వ నరకంగా మార్చారని మండిపడుటూ ఈ కోపాన్ని రానున్న జీహెచ్ఎంసి ఎన్నికల్లో కోట్ల రూపంలో చూపుతామని హెచ్చరిస్తున్నారు. ఈ వరదలకు కొద్దిరోజుల ముందే కేసీఆర్ ఎప్పటిలాగానే సర్వేలు నిర్వహించి గ్రేటర్ ఎన్నికల్లో ఈసారి తెరాస సెంచరీ కొట్టి 100 చోట్ల పాగా వేస్తుందని, ఇదే ఫైనల్ ఫలితమని చాలా బలంగా చెప్పారు. కేసీఆర్ గతంలో అనేక ఎన్నికల గురించి ఇలాగే సర్వేలు నిర్వహించి చెప్పిన ఫలితాలు చాలావరకు నిజమయ్యాయి. అందుకే తెరాస 100 సీట్లు నెగ్గడం సాధ్యమేనని చాలామంది జనం అనుకున్నారు.
కానీ వరదలొచ్చి వారి అభిప్రాయాన్ని చెరిపేశాయి. చెరిపాయి అనడం కంటే అభిప్రాయాన్ని మార్చివేయాలనే కసిని రగిల్చాయి అనాలి. 100 కొడతామని సర్వేల లెక్కలు చూసి మురిసిపోతున్న కేసీఆర్‌గారికి షాక్ ఇవ్వాలని, ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ప్రతాపం చూపిస్తామని సోషల్ మీడియాలో విరుచుకుపడిపోతున్నారు. కావాలంటే కేసీఆర్ ఇప్పటికిప్పుడు మరొకసారి సర్వేలు చేయించుకుని రాబోయే ఫలితాలను చూసుకోవచ్చని, ఎన్నికలకు వెళ్లడం కాదు ముందు శాంపిల్ సర్వేలు నిర్వహించి ఫలితం ఎలా ఉంటుందో చూసే దమ్ముందా అనడుగుతున్నారు.