పవన్ కళ్యాణ్ ఆ తప్పు చేయకుండా వుండాల్సిందేమో.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడిపై ఎందుకు స్పందించారు.? అసలాయన స్పందించకుండా వుండి వుంటే ఎంత బావుండేది.? ఈ చర్చ ఇప్పుడు జనసేన వర్గాల్లోనే జరుగుతోంది. వాస్తవానికి టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని జనసేన ఖండిస్తే.. అది తప్పు పట్టాల్సిన విషయం కాదు.

ఇలా దాడి జరిగిందో లేదో, అలా జనసేన అధినేత నుంచి స్పందన వచ్చేసింది. అదే అతి పెద్ద బ్లండర్ అయి కూర్చుంది. కొంత సమయం తీసుకుని, పార్టీ తరఫున ఏ నాదెండ్ల మనోహర్ ద్వారానో, ఇంకో జనసేన కీలక నేతతోనే ప్రకటన ఇప్పించి వుంటే, పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లయ్యేది.. పవన్ మీద వైసీపీ ఇంతలా విరుచుకుపడేది కూడా కాదు.

వాస్తవానికి, టీడీపీపై వైసీపీ దాడి వెనుక పెద్ద కథే వుంది. అదే టీడీపీ నేత పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద బూతులతో విరుచుకుపడటం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ‘మనల్ని అభిమానించేవారి రియాక్షన్..’ అని చెప్పడం వెనుక అసలు కోణం చాలామందికి అర్థమయ్యింది. రాజకీయాల్లో ఇలాంటి రియాక్షన్స్ వుండకూడదు.. కానీ, పరిస్థితులు అలా మారిపోయాయ్.

టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించడం ద్వారా జనసేనకు ఒరిగిన లాభమేంటి.? సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు వీలు చిక్కినప్పుడల్లా జనసేన మీద విమర్శలు చేస్తూనే వున్నారు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని. అలాంటప్పుడు, జనసేన ఎందుకు ఇంతలా తొందరపడినట్టు.?

జనసేన కార్యకర్తలు జరుగుతున్న తతంగానికి సంబంధించి తమ అధినేత ప్రకటనను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో కోడి కత్తి వ్యవహారం నేపథ్యంలో సీఎం జగన్ పట్ల జనసేన సంఘీభావం ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. జనసైనికులు ‘కవర్ డ్రైవ్స్’ చేసుకోవాల్సి వస్తోంది.

జనసేనాని ఇలాంటి విషయాల్లో ఒకింత ఆచి తూచి అడుగేయకపోతే కష్టమే మరి.