బస్తీ మే సవాల్: పవన్ కళ్యాణ్.. ఆ మాటల్ని మర్చిపోయారా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటున్నారు. వైసీపీకి ప్రస్తుతం వున్న 151 సీట్లలోంచి ఓ డిజిట్ తగ్గిపోయి.. 15 సీట్లకే పరిమితమవ్వాల్సి వస్తుందేమో. మరీ, సున్నా సీట్లు వైసీపీకి వస్తాయని అనుకోలేం కదా.? అంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళగిరిలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం మారబోతోందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ‘పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోతాడని ఎవరైనా అనుకున్నారా.? నేను ఓడిపోయాను కదా.? వైసీపీ పరిస్థితి కూడా అలాగే రివర్స్ అవ్వొచ్చు..’ అన్నది పవన్ కళ్యాణ్ వాదన. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడకపోతే, జనసేన పార్టీలో నేతలెవరూ మిగలరు.. అసలు జనసైనికులే వుండరు. అది వేరే సంగతి.

కానీ, 2014 ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే అన్నారు.  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఒప్పుకోను.. అది జరగనివ్వను.. అని అన్నారాయన. కానీ, ఏం జరిగింది.? వైఎస్ జగన్ సంచలన విజయాన్ని అందుకున్నారు. సరే, రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు జరగొచ్చు. 23 సీట్లకే పరిమితవ్వాల్సి వస్తుందని టీడీపీ అనుకుని వుంటుందా.? వైసీపీ సైతం భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, ఆ స్థాయిలో వైసీపీని దెబ్బకొట్టగలిగేంత రాజకీయ బలం జనసేనకు వుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

నిజానికి, ఈ రోజు పవన్ కళ్యాణ్ ప్రసంగం చాలా సాఫీగా ప్రారంభమైంది.. ప్రజలు ఆలోచించేలా చేసింది. కానీ, కొన్ని చోట్ల పవన్ మాట మీద అదుపు కోల్పోయారు. ఇవే, వీటినే పవన్ తగ్గిస్తే.. జనసేనకు మంచి భవిష్యత్తు వుండొచ్చు. అధికారంలోకి జనసేన వచ్చే అవకాశం వుందా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, జనసేనాని వ్యూహాత్మక రాజకీయాలు, సంయమనంతో కూడిన రాజకీయాలు చేస్తే.. జనసేన కొంత మేర ప్రజలకు చేరువయ్యే అవకాశాలు లేకపోలేదు.