పార్టీలో కుమ్ములాటలు.! వైఎస్ జగన్‌కి అదే పెద్ద తలనొప్పి.!

గడచిన మూడున్నరేళ్ళలో రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందించామనే గట్టి నమ్మకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో వుంది. ఎవరు అధికారంలో వున్నా, ఈ కాన్ఫిడెన్స్ ఇలాగే వుంటుంది. అయితే, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ దాదాపుగా చేసేశామనే భావనలో వైఎస్ జగన్ వుండడమే కాదు, నిజంగానే చాలావరకు నెరవేర్చారు కూడా.

అయితే, పార్టీలోనే నాయకుల రాజకీయాలతో తలనొప్పి వచ్చి పడుతోంది వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. టిక్కెట్లు మళ్ళీ దక్కుతాయో దక్కవోనన్న ఆందోళన కొందరిలో కనిపిస్తోంది. ఆధిపత్య పోరులో భాగంగా ఇంకొందరు రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో పార్టీ పరువు బజార్న పడుతోంది.

కింది స్థాయిలో పార్టీ పునాదులు కదిలిపోయేలా వైసీపీ నేతల కుమ్ములాటలు ఈ మధ్య తరచూ కనిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఓ చోట ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వ్యక్తులపై తీవ్రస్థాయి వ్యతిరేకత రచ్చకెక్కుతున్న దరిమిలా, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టాల్సినవారే కనిపించడంలేదు.

విజయసాయిరెడ్డి కావొచ్చు, వైవీ సుబ్బారెడ్డి కావొచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావొచ్చు.. వీళ్ళెవరూ ఈ ప్రకంపనల్ని చల్లార్చేందుకు ప్రయత్నించడంలేదు. అన్నిటికీ అధినేతే సమాధానం చెప్పాలంటే కుదిరే పని కాదు. ఓ వైపు ప్రభుత్వాన్ని నడపాలి, ఇంకో వైపు పార్టీలో చిన్నా పెద్ద వివాదాల్ని పరిష్కరించాలంటే అది చాలా పెద్ద టాస్క్ అవుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.

వచ్చే ఎన్నికల్లో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు టిక్కెట్లు దక్కించుకోవడం కష్టమేనన్న ప్రచారం ఎప్పుడైతే తెరపైకొచ్చిందో, ఆ తర్వాతి నుంచే అసలు రచ్చ షురూ అయ్యింది. పైకి ‘అవినీతి రహిత ప్రభుత్వం..’ అని చెబుతున్నా, కింది స్థాయిలో అవినీతి మరకలు వైసీపీకి గట్టిగానే అంటుకుంటున్నాయ్. ఇవన్నీ పార్టీ పుట్టి ముంచేసేలా వున్నాయ్ అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.