ఓటీఎస్.. జగన్ సర్కారుకి సరికొత్త తలనొప్పి.!

ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా కింది స్థాయిలో నిర్ణయాలు జరిగిపోతాయా.? ప్రభుత్వ ఆలోచనలకు విరుద్ధంగా అధికారులు ఆదేశాలు జారీ చేయగలరా.? అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒకరిద్దరు అధికారులు చేసిన తప్పిదం.. అని కొట్టిపారేయడానికి వీల్లేని సందర్భమిది.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం విషయమై ‘వన్ టైమ్ సెటిల్మెంట్’ అంశం తెరపైకొచ్చింది. వైఎస్ జగన్ సర్కార్, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సెటిల్మెంట్ అంశాన్ని లబ్దిదారుల ముందుంచింది. ఇంకేముంది.. కింది స్థాయిలో పంచాయితీ కార్యదర్శులు కొందరు, ఈ పథకానికీ.. సామాజిక పెన్షన్లకూ ముడిపెట్టారు.

దాంతో, ఈ రోజు కొంతమంది పెన్షన్ దారులు (వృద్ధులు సహా.. పెన్షన్లు పొందుతున్న ఇతరులు) సామాజిక పెన్షన్లు అందుకోలేకపోయారు. చాలా తక్కువ సంఖ్యలోనే లబ్దిదారులు ఈ సమస్యని ఎదుర్కొన్నారు.. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే.

‘అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి.. మేం పెన్షన్లు ఇవ్వలేం..’ అని లబ్దిదారులకు వాలంటీర్లు తేల్చి చెప్పారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. విపక్షాలు, ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. దాంతో, చేసేది లేక మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకొచ్చి, డ్యామేజీ కంట్రోల్ చర్యలకు దిగాల్సి వచ్చింది.

‘వన్ టైమ్ సెటిల్మెంట్’ అనేది కేవలం ఓ ఆప్షన్ మాత్రమేననీ, దానికీ.. సామాజిక పెన్షన్లకూ లింకు లేదనీ, ఓటీఎస్ బలవంతంగా అమలు చేయడంలేదనీ వివరణ ఇచ్చుకున్నారు బొత్స సత్యనారాయణ. ‘తప్పనిసరి’ ఆదేశాలు జారీ చేసిన అధికారిపై చర్యలకు కూడా ఉపక్రమించిందట ప్రభుత్వం.

కానీ, జరగాల్సిన డ్యామేజీ అయితే ఎక్కువే జరిగిపోయింది. ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఎందుకు అలసత్వం జరుగుతోందోగానీ, అది చాలా ఖరీదైన తప్పిదంగా మారిపోతోంది.