OmicronTest Kit: ప్రపంచ దేశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇప్పుడు దీని కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కరోనాని నియంత్రించడానికి శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అది దాని రూపాన్ని మార్చుకొని ఇప్పుడు మరొక వేరియంట్ రూపంలో ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులను తగ్గించడానికి ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి. అయితే దీని వ్యాప్తి నివారించడానికి ఎక్కువ సంఖ్యలో టెస్ట్ లు చేసి వ్యాధి నిర్ధారణ తొందరగా జరగాలి.
ఇప్పుడు ఒక ఒమిక్రాన్ టెస్ట్ ఫలితాలు రావడానికి కనీసం మూడు రోజులు సమయం పడుతుంది. ఈ లోపు పాజిటివ్ వచ్చిన వారి నుండి వ్యాధి చాలా మందికి సంక్రమిస్తుంది. అయితే ఈ ఒమిక్రాన్ ను త్వరగా గుర్తించడానికి భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఒక కిట్ ను తయారుచేసింది. దీని పేరు ఒమిషురు. దీనిని టాటా మెడికల్, డయాగ్నొస్టిక్స్ వారు తయారు చేశారు. టాటా మెడికల్, ICMR భాగస్వామ్యంతో ఒమిక్రాన్ గుర్తించే టెస్ట్ కిట్ ఇండియాలో తయారు చేసినట్టు ICMR డైరెక్టర్ డాక్టర్ బలరాం భార్గవ్ గారు తెలిపారు.
ఈ టెస్ట్ కిట్ జనవరి 12 నుండి మార్కెట్లో లభిస్తుందని దీని కనీస ధర రూ. 250 గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ RT-PCR టెస్ట్ ద్వారా నాలుగు గంటలలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా వ్యాప్తిని నివారించే చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కిట్ల లో ఒమిక్రాన్ గుర్తించే కిట్స్ తక్కువ సంఖ్యలో ఉన్నాయి .
ప్రపంచం మొత్తం మీద గడచిన 24 గంటలలో దాదాపు 27 లక్షల కోవిడ్-19 కేసులు వచ్చాయి అంటే దీని తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాస్కులు వాడటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ లు వాడటం , తరచూ చేతులను శుభ్రంగా ఉంచుకుంటూ తగిన నియమాలను పాటించటం వల్ల కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చు .