3 Capitals For AP : ఏకైక రాజధాని కాదు, మూడు రాజధానులే.! అయితే.?

3 Capitals For AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వుండాలన్నది వైఎస్సార్సీపీ ఆలోచన. అందుకే, వైఎస్ జగన్ సర్కారు వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల్ని ప్రతిపాదించింది. ఇప్పటికే వున్న అమరావతికి తోడుగా, మరో రెండు రాజధానుల్ని గతంలోనే ప్రతిపాదించారు, చట్టమూ జరిగింది.. అయితే న్యాయ వివాదాల కారణంగా ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

అయితే, పాత బిల్లులోని లోపాల్ని సరిదిద్ది, ఎలాంటి సమస్యలకూ ఆస్కారమివ్వకుండా కొత్త బిల్లు పెడతామంటూ వైఎస్ జగన్ సర్కారు చెబుతూ వస్తోంది. పలువురు మంత్రులు ఇప్పటికే స్పష్టతనిచ్చారు. అయితే, విశాఖనే పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించేసి అమరావతిని, కర్నూలుని రాజధానుల విషయంలో లైట్ తీసుకోవడమే బెటరన్న ఆలోచనకి జగన్ సర్కారు వచ్చిందంటూ వైసీపీ అనుకూల మీడియాలోనే ప్రచారం జరుగుతోంది.

కాగా, మూడు రాజధానులు ఖచ్చితంగా వస్తాయంటూ తాజాగా పలువురు మంత్రులు స్పష్టతనిస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు బిల్లు ప్రవేశపెడతారట. మరి, అమరావతి వివాదాన్ని ఎలా అడ్రస్ చేస్తారట.?

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో చర్చించినట్టు, అమరావతి రైతులతో చర్చించి, సమస్యకు సరైన పరిష్కారం చూపాల్సిన జగన్ సర్కార్.. ఆ దిశగా ఆలోచనే చేయడంలేదు. అమరావతి రైతులు ఇప్పటికే కోర్టుని ఆశ్రయించి వున్నారు. కోర్టులో కేసుల విచారణ కొనసాగుతోంది.

సో, వివాదాలకు తావు లేకుండా మూడు రాజధానులనేది సాధ్యపడే వ్యవహారం కాదేమో.! అయినాగానీ, ప్రభుత్వ పెద్దలు అంత ధీమాగా ఎలా చెప్పగలుగుతున్నారు.? అమరావతి కోసం ఏదైనా స్పెషల్ ప్యాకేజీ వుండబోతోందా.? ఏమో, వేచి చూడాల్సిందే.