భారతీయ జనతా పార్టీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు ఎదురే లేదన్నట్టు ఫీలైపోతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితంతో ఇక భవిష్యత్తు మాదే అనే భ్రమలోకి వెళ్లిపోయారు. సరే దుబ్బాక అంటే తెలంగాణ వ్యవహారం కాబట్టి అక్కడ బీజేపీ శాఖ హంగామా చేసిందంటే ఒక అర్థం ఉంది. కానీ ఏపీ బీజేపీ శాఖ హంగామా చేస్తోంది. దుబ్బాకలో గెలిచేశాం మాకు ఎదురులేదు అంటున్నారు. మరి ఆ లాజిక్ ఏంటో వారికే తెలియాలి. బీజేపీకి సోము వీర్రాజు కొత్త అధ్యక్షుడు అయినప్పటి నుండి పార్టీలో కొంత హుషారు వచ్చిన సంగతి వాస్తవమే. ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ తమ నిర్ణయాలే కీలకం, తమ పంథానే రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంలో బీజేపీకి అంత సీన్ లేదు.
సోము వీర్రాజు హడావిడి చూసి మొదట్లో బీజేపీ పుంజుకుంటుందని అనుకున్నారు. వైసీపీ, తేదేపా నుండి కొందరు నేతలు బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కేంద్ర స్థాయి నుండి సపోర్ట్ ఉంటుందని వారికి బాగానే ఆశజూపారు. ఈ గాలానికి టీడీపీ నేతలు ఎక్కువగా చిక్కుతారని బీజేపీ హైకమాండ్ భావించింది. తెలుగుదేశం నేతలు కూడ వైసీపీ నుండి ఒత్తిడి ఎక్కువడం, వ్యాపార మూలాల మీద జగన్ టార్గెట్ పెట్టడం, పలువురు నేతలను అరెస్ట్ చేయడంతో భయపడి పెద్ద అండ లేకపోతే జగన్ బారి నుండి తప్పించుకోవడం కష్టమని భావించి బీజేపీ వైపు చూడసాగారు. కొందరు నేతలు బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారన్నది కూడ వాస్తవం. పైగా బీజేపీతో జనసేన పొత్తులో ఉండటంతో నేతలు మరింత ఆకర్షితమయ్యారు.
ఇక బీజేపీలోకి వలసలు ప్రారంభమవుతాయని అనుకుంటుండగా సోము వీర్రాజుగారు ప్రతాపం బయటపడింది. తోటి నేతలను ఆయన ఎలా చూస్తున్నారనేది బహిర్గతమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి వ్యతిరేకమైన పార్టీల గురించి ఒక్క మాట కూడ మంచిగా మాట్లాడకూడని, పార్టీ నిర్ధేశించిన నియమాలను తూచా తప్పకుండా పాటించాలనే నియమం పెట్టారు. అంతెందుకు మీడియా ముందు ఏం మాట్లాడాలో కూడ ఫీడింగ్ తామే ఇస్తామన్నారు. వీటిలో వీటిని మీరినా పార్టీ నుండి సస్పెండ్ అవడం ఖాయమని చెప్పారు. చెప్పడమే కాదు కొందరిని సస్పెండ్ చేసి ఉదాహరణలు కూడ చూపించారు. ఇక బీజేపీ అవలంభిస్తున్న ద్వంద వైఖరి గురించి కూడ నేతలు భయపడ్డారు.
రాష్ట్రంలో పరిస్థితులు ఒకలా ఉంటే కేంద్ర నిర్ణయాలు ఇంకోలా ఉంటున్నాయి. రాష్ట్ర శాఖ కేంద్రానికి, రాష్ట్రానికి మధ్యలో నిలబడి జనాన్ని తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. అలాంటి చోట మనుగడ అంటే దినదిన గండమే అని నేతలకు అర్థమైంది. ఇక బీజేపీ నెత్తికెత్తుకున్న మతత్వాన్ని నేతలు సహించలేకపోయారు. రాష్ట్రంలో మత ప్రాతిపదికన రాజకీయం చేయడానికి బీజేపీ పూనుకోవడం అతి ప్రమాదకరమైన పరిణామమని, ఏమాత్రం తేడా వచ్చినా ఓటర్ల చీత్కారానికి గురై కనుమరుగపోతామని తెలుసుకున్నారు. అందుకే ఆ పార్టీలోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకుని ఉన్న చోటనే ఏదోలా సర్దుకుపోదామని డిసైడ్ అయ్యారు. కాబట్టే సోము వీర్రాజు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బీజేపీలో చేరికలనేవే లేకుండా పోయాయి.