Tollywood : తెలుగు సినిమాకి వేరే శతృవు అక్కర్లేదు సుమీ.!

Tollywood : తమ ఆవేదనని ప్రభుత్వాలకి చెప్పుకోవాలంటే, దానిక్కూడా నానా రకాల రాజకీయాలూ నడాల్సిందే. ఆధిపత్య పోరు, కుట్రలు, కుతంత్రాలు.. అహో, సినీ పరిశ్రమలో జరిగే వ్యవహారాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మాది సినీ కుటుంబం. మేమంతా సినీ కళామతల్లి బిడ్డలం..’ అని పైకి చెప్పుకోవడమే తప్ప, సినీ జనాల మధ్య ‘ఐక్యత’ కనిపించదుగాక కనిపించదు.

పైరసీ విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అసలు ఈ పైరసీ బూతం వెనుక వున్నదే కొందరు సినీ ప్రముఖులనే విమర్శ ఎప్పటినుంచో వుంది. సరే, అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ.

ఎవరి సినిమాకి కష్టం వస్తే, వాళ్ళే ఆవేదన వ్యక్తం చేస్తారు తప్ప, ఇంకొకరు ఆ సినిమా కోసం అండగా నిలిచే పరిస్థితి కనిపించదు. ఒకవేళ అలా ఎవరన్నా ముందుకొచ్చినా, వాళ్ళని వెనక్కి లాగేసేందుకు ఎప్పుడూ కొంతమంది సిద్ధంగా వుంటారు.

కోవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఆ ఇబ్బందుల్ని తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల ముందుకు తీసుకెళ్ళి, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు పరిశ్రమకు సరైన ‘పెద్ద’ ఎవరూ లేకపోవడం శోచనీయం.

కొన్నాళ్ళ క్రితం వరకూ చిరంజీవి మీద ఆ బాధ్యత పెట్టారు కొందరు సినీ ప్రముఖులు. అది నచ్చని ఇంకొందరు, చిరంజీవిని నానా రకాలూగా అవమానించారు, చిరంజీవికి వ్యతిరేకంగా రాజకీయాలు నడిపారు. ఇప్పుడేమైంది.? ఎవరు బాధ్యత తీసుకుని, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడతారు.? అడక్కపోతే అమ్మైనా పెట్టదు. అలాంటిది ప్రభుత్వాలు, పరిశ్రమ సమస్యల్ని తమంతట తాముగా అర్థం చేసుకుంటాయా.?