‘ఎవరో వదిలిన బాణాన్ని కాదు నేను..’ అని ఓ ప్రశ్నకు తెలివిగా సమాధానమిచ్చారుగానీ, వైఎస్ షర్మిల అంటే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వదిలిన బాణమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. తెలంగాణలో సెంటిమెంట్ పవర్ ఎక్కువ. అందుకే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లేవర్ లోలోపల వున్నా, దాన్ని బయటపడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు షర్మిల. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న షర్మిల, పార్టీ పేరుని ఇప్పటికే ఖరారు చేసేశారట. పార్టీ జెండా కూడా తయారైపోయిందట. ఇవన్నీ తయారు చేసిందీ, ఖరారు చేసింది ఇంకెవరో కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అనే ప్రచారం జరుగుతోంది. ‘తూచ్, అన్నతో రాజకీయంగా కొన్ని విభేదాలున్నాయి. అన్నకి నేను రాజకీయ పార్టీ పెట్టడం ఇష్టం లేదు..’ అని షర్మిల చెబుతున్నా, షర్మిల వేస్తున్న ప్రతి అడుగూ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే వుందన్న వాదనలు రోజురోజుకీ బలపడుతున్నాయి.
ఇదిలా వుంటే, షర్మిల పార్టీ జెండా రంగులు ఇలా వుండబోతున్నాయంటూ కొన్ని ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి.. అదీ గత కొద్ది రోజులుగా. ఆ గాసిప్స్ ప్రకారం చూస్తే, షర్మిల పార్టీ జెండా కూడా వైఎస్సార్సీపీ జెండాలానే వుండబోతోందట. అయితే, డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులుంటాయట. మూడు ‘ముఖ్యమైన’ రంగులకు అదనంగా ఇంకో రంగు వుండబోతోందన్నది తాజాగా వినిపిస్తోన్న ఊహాగానాల సారాంశం. ఎటూ వైఎస్సార్ బొమ్మ, ఆ జెండా మీద వుంటుంది. ఆరోగ్యశ్రీ సహా వైఎస్సార్ హయాంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించిన గుర్తులూ వుంటాయట జెండా మధ్యలో. ఇందులో నిజమెంత.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. వచ్చే నెలలో పార్టీ పేరు, జెండాని షర్మిల వెల్లడిస్తారంటూ వార్తలొస్తున్నాయి గనుక, అప్పటిలోగా మరిన్ని సరికొత్త గాసిప్స్ జగనన్న తెలంగాణపైకి వదిలిన షర్మిల అనే బాణం పెట్టబోయే పార్టీకి సంబంధించి రాబోతున్నాయన్నమాట.