బీజేపీ నీతి: ఏమీ చెయ్యం.! అధికారమే ముఖ్యం.!

No Development : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారా.? ఇవ్వలేదు.. కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పీఠమెక్కెయ్యాలి.. ఇదీ భారతీయ జనతా పార్టీ నీతి. తెలంగాణలోనూ అంతే, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు, కానీ.. తెలంగాణలో అధికారం దక్కెయ్యాలి.! ఎలా.?

పెద్ద నోట్ల రద్దు దగ్గర్నుంచి, జీఎస్టీ వరకు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఫెయిల్యూర్స్ అన్నీ ఇన్నీ కావు. పెద్ద నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యస్థ ఎలా చితికిపోయిందీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లీటర్ పెట్రోల్ ధర 120కి చేరుకున్నా, వంట నూనెల ధరలు లీటరుకి 200 దాటేసినా.. బీజేపీకి మళ్ళీ అధికారమిచ్చేయాలి, కేంద్రంతోపాటు.. రాష్ట్రాల్లో కూడా.

నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టుంది బీజేపీ నేతల తీరు. లేకపోతే, ‘ఒక్క ఛాన్స్.. ఉద్ధరించేస్తాం..’ అని తెలంగాణలో దేబిరించడమేంటి.? అదిగో, కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తున్నాం.. ఇదిగో, తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీ లేకుండా చేస్తాం.. అనలేకపోతోంది బీజేపీ.

‘తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే ఉద్ధరించేస్తాం..’ అని చెబుతున్న బీజేపీ, కేంద్రంలో అధికారంలో వుండి, దేశానికి చేసిందేంటి.?

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో టీడీపీతో జతకట్టి, ప్రభుత్వంలో భాగమై, ఆ రాష్ట్రానికి చేసిందేంటి.? తెలుగు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

2024 ఎన్నికల్లో తెలంగాణ, ఏపీల్లో ఉనికి చాటుకోవడం మాటేమోగానీ, దేశంలోనే అధికారం కోల్పోయే దుస్థితి బీజేపీకి రాబోతోంది.