New District In Andhra Pradesh : కొత్త జిల్లాల ఏర్పాటుతో, కొత్త లొల్లి తప్పదా.?

New District In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా కసరత్తులు జోరందుకున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి నేడో రేపో నోటిఫికేషన్ రాబోతోందంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్లుగా మీడియాలో కథనాలు దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల ప్రచారంలోనే, తాము అధికారంలోకి వస్తే లోక్ సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, అప్పట్లోనే ఈ జిల్లాల విభజన వ్యవహారం వివాదాలకు తావిచ్చింది.

తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు జరిగింది. 10 జిల్లాల తెలంగాణ కాస్తా, 30కి పైగా జిల్లాల్ని సంతరించుకుందిప్పుడు. పరిపాలనా సౌలభ్యం సహా అనేక రాజకీయ కోణాలు కూడా ఇందులో వుంటాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరగబోతోంది.? ఈ ప్రక్రియ ఎంత సజావుగా సాగుతుంది.? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది.

శ్రీకాకుళం జిల్లాని తీసుకుంటే, కాస్తో కూస్తో పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతానికి కొత్తగా ఏర్పడబోయే శ్రీకాకుళం జిల్లా దూరమైపోతుందన్నది అక్కడి ప్రజల వాదన. అలాగే, మిగతా జిల్లాల్లోనూ కొన్ని అభ్యంతరాలున్నాయి. మరి, వీటిని ప్రభుత్వం ఎలా అడ్రస్ చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.

కొత్త రాజధానుల తరహాలోనే కొత్త జిల్లాల వ్యవహారం కూడా వివాదాస్పదమవుతుందేమోనన్న అభిప్రాయమైతే చాలామందిలో వుంది. జిల్లాకో విమానాశ్రయం.. అని ఇటీవల ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి, 26 జిల్లాల్లో 26 ఎయిర్ పోర్టుల దిశగా ఆలోచనలు చేస్తారా.? అన్న ప్రశ్న కూడా తెరపైకి రావడం సహజమే కదా.!