ప్రస్తుతం మటన్ కు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా రాకుండా అడ్డుకునేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు చాలామంది మటన్ తినేందుకు ఆసక్తిని చూపుతున్నారు. నాన్ వెజ్ ఎక్కువగా తింటే శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ అందడంతో పాటుగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే మటన్ కు గిరాకీ పెరిగింది.
ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకున్నారు. అందుకే మటన్ మాఫియాకు తెర లేపారు. ఏకంగా ఢిల్లీ నుంచి విజయవాడకు అక్రమంగా పొట్టేళ్ల తలకాయలు, కాళ్లను తరలించారు. అవి ఎప్పుడో వారం పది రోజుల కిందటివి. వాటిని ఐస్ బాక్సుల్లో పెట్టి.. యూపీ నుంచి ఢిల్లీకి.. అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.
ఆదివారం పూట మటన్ కు ఎక్కువ గిరాకీ ఉంటుంది కాబట్టి.. దాన్న క్యాష్ చేసుకోవడం కోసం… తల, కాళ్లను మటన్ షాపుల్లో అమ్మడానికి తీసుకొచ్చారు.
విజయవాడకు అక్రమంగా పొట్టేళ్ల తల,కాళ్లను తరలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న కార్పొరేషన్ అధికారులు వెంటనే మటన్ మాఫియా గుట్టును రట్టు చేశారు. హౌరా ఎక్స్ ప్రెస్ లో వచ్చిన 26 బాక్సుల్లో ఉన్న పొట్టేళ్ల తలకాయ, కాళ్లను స్వాధీనం చేసుకొని.. వాటిని తీసుకెళ్లి వేరే ప్రాంతంలో పూడ్చిపెట్టారు.
చాలాకాలం నుంచి నిల్వ ఉంచిన మాంసాన్ని వేరే ప్రాంతాలకు తరలించి అమ్మి క్యాష్ చేసుకునే మటన్ మాఫియా గుట్టును ఎట్టకేలకు అధికారులు గుట్టు చేశారు. మటన్ కొనేటప్పుడు జాగ్రత్త వహించాలని.. కబేళాలలో కోసిన మటన్ ను మాత్రమే కొనుక్కోవాలని అధికారులు ప్రజలకు సూచించారు.