మోత్కుపల్లి నర్సింహులు.. ఒకప్పుడు టీడీపీ సీనియర్ నేత. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. మంచి వాగ్ధాటి వున్న నాయకుడేగానీ.. అనూహ్యంగా రాజకీయ తెరపై పలచనైపోతూ వచ్చారు. టీడీపీని వీడారు.. కాస్త తటపటాయించినా భారతీయ జనతా పార్టీలో చేరారు.. ప్రస్తుతం బీజేపీని వీడి, తెలంగాణ రాష్ట్ర సమితిలోకి దూకేందుకు సిద్ధమయ్యారు. అటు తిరిగి ఇటు తిరిగి.. ఒకప్పటి టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరబోతుండడం విశేషమే మరి.
నిజానికి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ కూడా ఒకప్పటి టీడీపీ ముఖ్య నేత కావడం గమనార్హం. తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా చాలామంది ఒకప్పుడు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన నాయకులే. తెలంగాణ రాష్ట్ర సమితిలో 90 శాతం మంది ఒకప్పటి టీడీపీ నేతలే వున్నారనుకోండి.. అది వేరే సంగతి. అప్పట్లో వీళ్ళంతా తెలంగాణ ద్రోహులుగా విమర్శలు ఎదుర్కొన్నవారే. ఇప్పుడేమో, నిఖార్సయిన తెలంగాణ వాదులైపోయారు.. గులాబీ పార్టీలో చేరడంతోనే.
సరే, రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామన్ అనుకోండి.. అది వేరే సంగతి. ఇంతకీ, మోత్కుపల్లి నర్సింహులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం వెనుక ఆంతర్యమేంటి.? గులాబీ బాస్ నుంచి ఆయనకు దక్కిన హామీ ఏంటి.? చంద్రబాబు తనను గుర్తించి, ఏదన్నా రాష్ట్రానికి గవర్నర్‌గా ప్రమోట్ చేస్తారని చాలా ఆశపడ్డారు మోత్కుపల్లి.
బీజేపీ – టీడీపీ పొత్తులో భాగంగా తనకు కీలకమైన పదవి (గవర్నర్ పదవి) వస్తుందని మోత్కుపల్లి ఎదురుచూసి భంగపడ్డ మాట వాస్తవం. మోత్కుపల్లి వెంట ఇప్పుడు క్యాడర్ పెద్దగా లేదు. కానీ, ఆయన వాగ్ధాటి, ఓ వర్గం ఓటు బ్యాంకు.. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని గులాబీ బాస్ మోత్కుపల్లిని తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.