ఈ ప్రచారమే కొంపముంచుతోంది.. చంద్రబాబుకు అర్థమవుతోందా?

దేశంలో ఏ రాజకీయ పార్టీ నేతకు లేని స్థాయిలో చంద్రబాబుకు పబ్లిసిటీపై ఆసక్తి ఉంది. తన గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎప్పుడూ పాజిటివ్ గా ప్రచారం జరగాలని చంద్రబాబు కోరుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే ఒక విధంగా ఈ ప్రచారమే చంద్రబాబు కొంప ముంచుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోదీ, చంద్రబాబు మధ్య గత కొన్నేళ్లుగా గ్యాప్ ఉండగా తాజాగా మోదీ, చంద్రబాబు ఒకరినొకరు కలుసుకుని మాట్లాడుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ బాబును పలకరించడం వల్ల ఎల్లో మీడియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా సమావేశంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబుతో పాటు అందరినీ పేరుపేరునా పలకరించడం గమనార్హం. అయితే ఎల్లో మీడియాలో మాత్రం మోదీ చంద్రబాబును స్పెషల్ గా ట్రీట్ చేశారనేలా వార్తలు వచ్చాయి.

వాస్తవానికి ఏపీలో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవడం ఒక విధంగా అసాధ్యం అనే సంగతి తెలిసిందే. బీజేపీ జనసేన ఇప్పటికే పొత్తులో ఉండగా టీడీపీతో పొత్తు దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేసినా టీడీపీతో పొత్తుకు అంగీకరించే ప్రసక్తి లేదని ఏపీ బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. చంద్రబాబు అనుకూల పత్రికలలో మాత్రం మోదీ చంద్రబాబుతో “మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది” అని చెప్పినట్టు రాయడం గమనార్హం.

మోదీని బాబు కలవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్న ఎల్లో మీడియా గత కొన్నేళ్లుగా చంద్రబాబుకు మోదీ ఎందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతుండటం గమనార్హం. చంద్రబాబు ప్రజలపై దృష్టి పెట్టకుండా ప్రచారంపై మాత్రమే దృష్టి పెడితే మాత్రం 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఫలితాలే 2024లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.