ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు, విపక్షాల నుంచి బీభత్సమైన సైలెన్స్

ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి మొత్తం 16 స్థానాలకుగాను ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 3 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు కాగా, మిగతావి స్థానిక సంస్థల నుంచి 11 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అధికారంలో వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది.

ఇంతకీ, విపక్షాలు ఎక్కడ.? విపక్షాలు.. అనడం కంటే, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎక్కడ.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. టీడీపీ నుంచి వల్లభనేని వంశీ సహా పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి దూకేసిన దరిమిలా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల గురించి టీడీపీ ఆలోచించే పరిస్థితి లేదు.

పోనీ, స్థానిక సంస్థల కోటా విషయంలో అయినా టీడీపీ గట్టిగా ప్రయత్నం చేస్తుందా.? అంటే, అక్కడా పరిస్థితి అత్యంత అధ్వాన్నంగానే వుంది. ఒకవేళ టీడీపీ హంగామా చేసి బరిలోకి దిగినా, ఆ తర్వాత ‘ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయ్..’ అంటూ గగ్గోలు పెట్టడం సర్వసాధారణమే.

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగానే జరుగుతున్నాయి. అయితే, అవసలు ఎన్నికలు కావు, ఎంపికలంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయనుకోండి.. అది వేరే సంగతి.

ఇదిలా వుంటే, అధికార వైసీపీలో ఆశావహులు చాలా ఎక్కువగా వున్నారు. అన్ని సమీకరణాల్నీ పరిగణనలోకి తీసుకుని, అత్యంత వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపికను చేపట్టింది వైసీపీ. దాంతో, ఎక్కడా అసంతృప్త స్వరాలైతే కనిపించడంలేదు.

కానీ, అసలు శాసన మండలి వద్దే వద్దని అసెంబ్లీలో తీర్మానం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడెలా ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు.? అన్న ప్రశ్న కూడా తెరపైకొస్తోంది. శాసన మండలి రద్దయ్యేవరకు.. దానికి సంబంధించి మిగతా వ్యవహారాలు యధాతథంగా కొనసాగించాలి కదా.?