‘ఒక్కో ఎమ్మెల్యేనీ వంద కోట్ల రూపాయలు వెచ్చించి కొనేందుకు కొందరు బ్రోకర్ గాళ్ళు ప్రయత్నించారు.. కానీ, మా పార్టీ ఎమ్మెల్యేలు అలాంటి ప్రలోభాలకు లొంగిపోలేదు..’ అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో చండూరులో జరిగిన బహిరంగ సభలో వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్రానికి కేసీయార్ ముఖ్యమంత్రి అయ్యాక, బోల్డన్ని ఫిరాయింపులు జరిగాయి. అవన్నీ ఎమ్మెల్యేల కొనుగోళ్ళేనని అప్పట్లో బాధిత పార్టీలు ఆరోపించారు. అప్పట్లో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ (ఖమ్మం జిల్లా నుంచి) టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల సంగతి సరే సరి.
రాజకీయాల్లో ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం అనేది సర్వసాధారణం. అధికార పార్టీలోకి దూకేస్తే ‘పనులు’ తేలిగ్గా అవుతాయ్. కాంట్రాక్టులు వస్తాయ్.. లేదంటే, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి, ఎన్నికల్లో చేసిన ఖర్చుని తిరిగి రాబట్టుకోవాలంటే పార్టీ మారాల్సిందే.
గతంలో ఐదు లేదా పది కోట్లకు ఎమ్మెల్యేలు అమ్ముడుపోయేవారు. ఇప్పుడు మరీ ఖరీదైన వ్యవహారంగా మారింది. 50 కోట్లు అనేది చిన్నమాట. వంద కోట్ల దాకా రేటు పలుకుతోందని తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు యత్నంతో తేలిపోయింది.
‘నువ్వు నేర్పిన విద్యయే..’ అన్నట్లుగా బీజేపీ, గతంలో టీఆర్ఎస్ అనుసరించిన వ్యూహాన్ని అమల్లో పెట్టింది. ట్విస్ట్ ఏంటంటే, అధికారంలో వున్న పార్టీ నుంచి.. అధికారం కోసం పరితపిస్తున్న పార్టీలోకి వలసలకు రంగం సిద్ధమవడమే ఇక్కడ విచిత్రం.