Liquor Ban : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదు.. అంటూ పదే పదే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతుంటారు. కానీ, మద్య నిషేధం విషయంలో మాట తప్పారు, మడమ తిప్పారు. రాజధాని అమరావతి విషయంలో కావొచ్చు, ప్రత్యేక హోదా విషయంలో కావొచ్చు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కావొచ్చు.. మాట తప్పాల్సి వస్తోంది, మడమ తిప్పాల్సి వస్తోంది.
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ విషయంలోనూ వైఎస్ జగన్ మాట తప్పారు, మడమ తిప్పారు. మద్య నిషేధం విషయంలోనూ అంతే. ఇచ్చిన మాటకీ, చేస్తున్న పనులకీ అస్సలు పొంతన లేదు. రాష్ట్రంల దశల వారీ మద్య నియంత్రణ.. చివరికి సంపూర్ణ మద్య నిషేధం.. అని చెప్పారు వైఎస్ జగన్.
మూడేళ్ళు పూర్తవుతోంది వైఎస్ జగన్ అధికార పీఠమెక్కి. మద్య నియంత్రణ దిశగా చిత్తశుద్ధితో ఒక్కటంటే ఒక్క కీలక నిర్ణయమైనా తీసుకున్నారా.? లేదాయె. మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి యేటా ఆదాయం పెరుగుతూనే వుంది.
‘మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకూడదని ప్రతిపక్షం టీడీపీ అనుకుంటోంది.. ఆ ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు అమలు కావు..’ అని సాక్షాత్తూ అసెంబ్లీలో వైఎస్ జగన్ చెప్పారంటే దానర్థమేంటి.?
ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా మడమ తిప్పాక, ‘ప్రజల సహకారంతో మద్య నిషేధాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి నారాయణ స్వామి చెప్పడం హాస్యాస్పదమే. ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అసాధ్యం. జస్ట్ అదొక పొలిటికల్ స్టంట్ మాత్రమే. ఆ స్టంట్ వైఎస్ జగన్ విజయవంతంగా చేసేస్తున్నారంతే.