లైగ‌ర్ మ్యానియా మొద‌లైంది.. సెప్టెంబ‌ర్‌లో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ర‌చ్చ ఖాయం

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ,డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ లైగ‌ర్. పూరీ కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ ఫై పూరీ – ఛార్మీ కౌర్ – కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మ‌ధ్య చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. తాజాగా మూవీ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్ విడుదల చేసారు. పోస్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ర‌క్తం చిందిస్తూ యాక్ష‌న్ మూడ్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ అభిమాన‌లుని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న లైగ‌ర్ చిత్రం సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, క‌న్న‌డ భాష‌ల‌లో రిలీజ్ కానుంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్యా పాండే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు కూడా గెలుచుకోవాల‌ని ఈ అమ్మ‌డు భావిస్తుంది. క‌రోనా వ‌ల‌న దాదాపు 11 నెల‌ల పాటు ఆగిన లైగ‌ర్ సినిమా నేటి నుండి తిరిగి షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని ఛార్మి త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది .

లైగ‌ర్ చిత్రంలో విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఈ పాత్ర కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్నాడు. లాక్‌డౌన్ స‌మ‌యంలోను క‌స‌ర‌త్తులు చేశాడు. ఇస్మార్ట్ శంక‌ర్‌లో రామ్‌ని మాస్ లుక్ లోకి మార్చి కేక పెట్టించిన పూరీ జ‌గన్నాథ్ ఇప్పుడు లైగ‌ర్‌లో విజ‌య్‌ని స‌రికొత్త లుక్‌లో చూపిస్తూ అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేయ‌నున్నాడు. లైగ‌ర్ అంటే టైగ‌ర్, సింహం క్రాస్ బ్రీడ్ కాగా, ఈ సినిమాకు ఆ పేరు పెట్ట‌డంపై ఇండ‌స్ట్రీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.