రఘురామ దగ్గర ఇంకెన్ని లేఖలున్నాయ్ చెప్మా.?

Letters King Raghu Rama Running Daily Serial

Letters King Raghu Rama Running Daily Serial

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖాస్త్రాల పర్వం కొనసాగుతోంది. వైసీపీ వ్యతిరేక వర్గం ఈ లేఖలకు విపరీతమైన పబ్లిసిటీ కూడా ఇచ్చేస్తోంది. అక్కడికేదో రఘురామ, కాబోయే ముఖ్యమంత్రి.. అన్నట్టుగా కొందరు నెటిజన్లు హంగామా చేస్తుండడం గమనార్హం. ఏమో గుర్రం ఎగరావచ్చు.. రాజకీయాల్లో ఏదైనా జరగనూవచ్చు. అలాంటి కోరికలేమన్నా రఘురామకి వున్నాయో లేవో.. అదైతే ప్రస్తుతానికి సస్పెన్స్. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, వైఎస్ జగన్ ప్రభుత్వానికీ రఘురామ కొరకరాని కొయ్యిలా తయారయ్యారన్నది నిర్వివాదాంశం. చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా తయారైంది.

వైసీపీకి రఘురామ ‘పక్కలో బల్లెం’లా తయారయ్యారంటే, అందుక్కారణం కొందరు వైసీపీ నేతలు మాత్రమే. నిజానికి, రఘురామ లాంటి ‘లాయలిస్టును’ వైఎస్ జగన్ వదులుకోకుండా వుండాల్సింది. ఏ విషయమ్మీదైనా పూర్తి పరిజ్నానంతో మాట్లాడుతుంటారు రఘురామ. అలాంటి వాగ్ధాటి వున్న రఘురామకు వైసీపీలో వైఎస్ జగన్ సరైన అవకాశం కల్పించి వుంటే, ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదు. ఇక, రఘురామ చేసిన తప్పులు కూడా చిన్నవేమీ కావు. కానీ, రఘురామ వ్యవహారం ఎందుకింతలా ముదిరిందో కాస్త జాగ్రత్తగా ఆలోచించి, బాధ్యలుపై వైఎస్ జగన్ చర్యలు తీసుకుని వుంటే, వైసీపీకి అది పెద్ద అడ్వాంటేజ్ అయివుండేది.

భజనపరులతో పార్టీకి ఎప్పటికైనా నష్టమే తప్ప లాభం వుండదు. కానీ, గతంలో చంద్రబాబు చేసిన తప్పే, ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చేస్తున్నారు. పాతిక మంది వైసీపీ ముఖ్య నేతలు ప్రెస్ మీట్ చెప్పి, తమ ప్రభుత్వాన్ని పొగుడుకున్నా, రఘురామ రాసే ఒక్క లేఖతో.. సీన్ మొత్తం మారిపోతోంది. ఇప్పటికి ఏడు లేఖలు రాశారు రఘురామ. అన్నటిలోనూ వున్నవి వాస్తవాలే. ఇంకెన్ని లేఖలు రఘురామ రాస్తారోగానీ, ఒక్కో లేఖకీ వైసీపీ సమాధానం ఇవ్వలేకపోతుండడం.. వైసీపీ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరమే.