కేటీఆర్ క్వశ్చన్: ఆంధ్రా గురించి తెలంగాణ ఎందుకు మాట్లాడకూడదు.?

KTR
KTR
KTR

ఏం ఆంధ్రపదేశ్ అనేది దేశంలో ఓ రాష్ట్రం కాదా.? మా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రపదేశ్ గురించి తెలంగాణ పౌరుడిగా, ఓ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేతగా నేను మాట్లాడకూడదా.?’ అంటూ గడుసుతనంతోపాటు అమాయకంగానూ ప్రశ్నించేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఏం, ఎందుకు ప్రశ్నించకూడదు.? ఆంధ్రపదేశ్ గురించే కాదు, దేశంలో ఏ రాష్ట్రం గురించైనా మాట్లాడొచ్చు. ఎక్కడి సమస్య గురించి అయినా స్పందించొచ్చు. స్పందించకూడదని ఎవరన్నా అంటే అది తప్పే అవుతుంది. విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి కేటీఆర్ ఇటీవల మద్దతు ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే, ముందు తెలంగాణ సమస్యలపై మాట్లాడండి, ఆ తర్వాత ఆంధ్రపదేశ్ గురించి మాట్లాడొచ్చంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేటీఆర్ మీద విరుచుకుపడ్డారు.

అసలే ఎమ్మెల్సీ ఎన్నికల హంగామా నడుస్తోంది తెలంగాణలో. సీమాంధ్రుల ఓటర్లు అత్యంత కీలకంగా మారనున్నాయి ఈ ఎన్నికల్లో. అదీ అసలు సంగతి.. అన్నది ఆయా పార్టీల వాదన. తూచ్, అదేం లేద్.. మా తమ్ముళ్ళు అక్కడ కష్టంలో వుంటే, మేం స్పందించకూడదా.? అన్నట్టు కేటీఆర్ గుస్సా అయ్యారు. కానీ, కేటీఆర్ తెలుసుకోవాల్సింది చాలా వుంది. నిజానికి, ఆయనకు అదంతా తెలియదని అనుకోలేం. అందుకే, పాత జ్ఞాపకాల్ని ఆయన నెమరు వేసుకుంటే మంచిది. ఉద్యమ కాలంలో ఆంధ్రోళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారాయె. ‘అబ్బే, అదంతా ఉద్యమ సెగ. ఆ తర్వాత మంచిగున్నాం కదా..’ అంటే, మంచిగానే వున్నారు.. కాదన్నదెవరిక్కడ.? ప్రత్యేక హోదా విషయంలో గుస్సా అయ్యారు, పోలవరం ప్రాజెక్టు విషయంలో కిరికిరి పెడుతున్నారు.. ఇన్నీ చేసేసి, ఇప్పుడు ‘ఆంధ్రాకి సమస్య వస్తే, మేం అండగా నిలబడతాం..’ అని టీఆర్ఎస్ చెప్పుడేంది.?