సంక్రాంతి పండుగ అంటే గ్రామాల వైపు ప్రయాణాలు, తిరుగు ప్రయాణాలంటే నగరాల వైపు పరుగులు. ఈ ఏడాది ఆ పండుగ రద్దీ ఏపీఎస్ఆర్టీసీకి అదృష్టంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలోనే తొలిసారిగా ఒకే రోజులో అత్యధిక ఆదాయం నమోదైంది. జనవరి 19న నమోదైన గణాంకాలు ఏపీఎస్ఆర్టీసీ పనితీరుకు అద్దం పట్టాయి.
సంక్రాంతి సెలవులు ముగిశాక తిరుగు ప్రయాణాలు ఊపందుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో నిండిపోయాయి. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వైపు పెద్ద సంఖ్యలో ప్రజలు కదిలిరావడంతో ఆర్టీసీ సర్వీసులకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో ప్రైవేట్ బస్సుల్లో జరిగిన ప్రమాదాలు, అధిక చార్జీలు ప్రయాణికులను ఆర్టీసీ వైపు మరింత ఆకర్షించాయి. చార్జీలు పెంచకుండా, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చిన ఏపీఎస్ఆర్టీసీపై ప్రజలకు ఉన్న నమ్మకం మరోసారి స్పష్టమైంది.
ఒక్కరోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం ఆర్జించడం ద్వారా ఏపీఎస్ఆర్టీసీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజులో ఈ స్థాయి ఆదాయం రావడం సంస్థ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. బస్సుల ఆక్యుపెన్సీ భారీగా పెరగడం, ప్రతి సర్వీస్‌లో ప్రయాణికుల రద్దీ ఉండటం ఈ రికార్డుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఆదాయంతో పాటు ప్రయాణికుల సంఖ్యలోనూ ఏపీఎస్ఆర్టీసీ అదరగొట్టింది. జనవరి 19 ఒక్కరోజులోనే దాదాపు 50.6 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి బస్సులు నిరంతరంగా నడవడం, అదనపు సర్వీసులను సమర్థవంతంగా నిర్వహించడం వల్ల పెద్దగా ఇబ్బందులు లేకుండా ప్రయాణాలు సాగాయి.
పండుగ తర్వాత తిరుగు ప్రయాణాల్లో రద్దీ ఉంటుందని ముందుగానే అంచనా వేసిన ఆర్టీసీ, ప్రధాన రూట్లతో పాటు డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. టికెట్ కౌంటర్లు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించడంతో ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు పొందగలిగారు. ఈ ముందస్తు ప్రణాళికే రికార్డు స్థాయి ఫలితాలకు బాటలు వేసింది.
ఈ ఘన విజయంపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సంతోషం వ్యక్తం చేశారు. డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది నుంచి అధికారులు వరకు అందరి కృషి వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ప్రశంసించారు. ప్రజలకు మరింత మెరుగైన, సురక్షిత సేవలు అందిస్తూ ఏపీఎస్ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని ఆయన తెలిపారు.
