ఇది అందరి హైదరాబాద్…లాక్కోవాలని చూస్తున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పండి: ఎన్నికల ప్రచారంలో కేటీఆర్

ktr made harsh comments on bjp party in election campaign

హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ బీజేపీ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత కల్లోలాలు సృష్టించేందుకే బీజేపీ వచ్చిందని విరుచుకుపడ్డారు. హిందూ-ముస్లింల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా ఓట్లు సాధించాలని చూస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం నగరం ప్రశాంతంగా ఉండడంతో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు వచ్చాయని.. ఇప్పుడా వాతావరణాన్ని బీజేపీ నేతలే చెడగొడుతున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, మూసాపేట్‌ డివిజన్లలో మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ktr made harsh comments on bjp party in election campaign
KTR road show

ఈ హైదరాబాద్‌ మన అందరిది కానీ కొందరి హైదరాబాద్‌గా మార్చేందుకు కుట్రలు చేస్తున్న వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో ఎలా విజయం సాధించామో అదే పద్ధతిలో మళ్లీ విజయఢంకా మోగించాలని ప్రజలకు సూచించారు. గత బల్దియా ఎన్నికల్లోనూ కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

తెలంగాణలో ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేశామని అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో హైదరాబాద్‌ ప్రశాంతంగా ఉందని అన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని అన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారని ధ్వజమెత్తారు. ‘‘ఎన్నికల వేళ కొత్త బిచ్చగాళ్లు వచ్చారు. చలాన్లు కొట్టొద్దు.. బండిపై నలుగురు ఎక్కొచ్చని అంటున్నాడు. తాగి బండి నడపవచ్చట. బండి పోతే బండి ఫ్రీ. కారుపోతే కారు ఫ్రీ. ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ. 25 వేలు ఇస్తానని ఆయన అంటున్నాడు. వరదసాయం రూ.10 వేలు ఇస్తుంటే మీరే ఆపారు. అలాంటిది రూ.25 వేలు ఇస్తారా? అమ్మకు అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తడా? వరదల సమయంలో మేమంతా మీవెంటే ఉన్నాం.’’ అని ఎద్దేవా చేశారు.

‘‘బీజేపీ నేతల కథలు వినేందుకు.. ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు. హైదరాబాద్. మీ డ్రామాలు ఇక్కడ నడవవు. మీరు ఆగమాగం చేస్తే ఎవరూ కారు. ఆరేళ్లలో హైదరాబాద్‌లో మేం ఎన్నో చేశాం. ఆరేళ్లలో హైదరాబాద్‌కు కేంద్రం ఏం చేసింది? కిషన్ రెడ్డికి దమ్ముంటే ఒక్కటంటే ఒక్క పని చూపించండి.’’ అని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.