ఎవరైనా నేత పార్టీని వీడుతున్నారు అనే మాట వస్తే అది టీడీపీ గురించే అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది పరిస్థితి. అదని ఇదని లేకుండా అన్ని జిల్లాల్లోనూ తెలుగుదేశం నేతలు పార్టీకి బైబై చెప్పేస్తున్నారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడగా పదవిలో లేనివారు, చిన్నా చితకా నేతల సంఖ్యకు లెక్కేలేదు. గుట్టుచప్పుడు కాకుండా వలసలు జరిగిపోతున్నాయి. తెలుగుదేశంలో ఇలా ఉంటే వైసీపీలో పరిస్థితులు ఇంకో రకంగా ఉన్నాయి. అధికార పార్టీ అయినప్పటికీ అందులో అసంతృప్తులకు కొదవేమీ లేదు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం పెంచుకునే ప్రయత్నంలో ఎడతెగని వర్గ విబేధాలు రాజుకుంటున్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో కీలక నేతగా ఉన్న కిల్లి కృపారాణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇన్నాళ్లు జిల్లా ప్రెసిడెంట్ బాధ్యతలను నిర్వర్తించిన ఆమె ఇకపై తప్పుకోవాలని డిసైడ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు శ్రీకాకుళం రాజకీయాలు మీద గట్టి పట్టుంది. అటు ఇటుగా కింజారపు ఎర్రన్నాయుడుకు ధీటైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఎర్రన్నాయుడు టీడీపీలో ఉంటే కృపారాణి కాంగ్రెస్ పార్టీ నుండి రాజకీయం నడిపారు. 2009 ఎన్నికల్లో ఎర్రన్నాయుడినే ఓడించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆమె వైసీపీలోకి రావడంతో శ్రీకాకుళంలో వైసీపీ బలపడింది.
గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలను వైసీపీ బద్దలుకొట్టగలిగింది అంటే అందులో కిల్లి కృపారాణి పాత్ర ఎంతో ఉంది. అయితే మొదటి నుండి ఆమె పట్ల హైకమాండ్ నిర్లక్ష్య వైఖరినే ప్రదర్శిస్తోంది. టికెట్ ఇవ్వకపోగా ఏ పదవీ ఇవ్వలేదు. వైసీపీలోకి వచ్చాక ఆమె రాజ్యసభ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. సరే జిల్లా పెద్దగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుదాం అనుకున్నారు. కానీ పార్టీ నేతలు ఎవరూ కలిసి రాకాపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారట. అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని చెప్పుకుంటున్నాయి శ్రీకాకుళం రాజకీయ వర్గాలు.