బీజేపీలోకి దూకేస్తున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని.?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పేయబోతున్నారట. అదేంటీ, ఆయన టీడీపీకి ఎప్పుడు దగ్గరగా వున్నారు గనుక.? అన్న డౌట్ మీకొస్తే.. అది మీ తప్పు కానే కాదు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ఆధిపత్య పోరు తర్వాత, టీడీపీకి దాదాపుగా దూరమైపోయారు కేశినేని నాని.

ఇటీవల చంద్రబాబుని కలిసి వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదనీ, ఈలోగా పార్టీ మారబోననీ కేశినేని నాని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఇంతలోనే ఏమయ్యిందోగానీ, టీడీపీ బెజవాడ కార్యాలయంగా చెప్పబడుతోన్న కేశినేని భవన్ నుంచి చంద్రబాబు ఫొటోలు గల్లంతయ్యాయి. ఆ స్థానంలో వేరే ఫొటోలు వచ్చాయి.

కేశినేని నాని ప్రస్తుతం బీజేపీ అధినాయకత్వంతో సన్నిహితంగా వుంటున్నారనీ, ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారనీ ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్ళ క్రితం పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని. అప్పట్లో నాని, టీడీపీలో యాక్టివ్‌గా వుండేవారు మరి.

వాస్తవానికి, మొదటి నుంచీ టీడీపీలో కేశినేని నాని ఇమడలేకపోతున్నారు. ఆధిపత్య పోరు తట్టుకోలేకపోతున్నారు. దానికి తోడు, స్వతహాగా ఆయన వివాదాస్పద వైఖరి నేపథ్యంలో పార్టీ నుంచి కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఇంత గందరగోళం నడుమ, ఆయన ఎక్కువ కాలం టీడీపీలో కొనసాగే అవకాశమే లేదని చాలాకాలంగా ప్రచారం జరుగుతూనే వుంది.

ఇదిలా వుంటే, కేశినేని నాని ధైర్యంగా టీడీపీని వీడే పరిస్థితి లేదనీ, ఇంకో వైపు నుంచి ఆయనకు పూర్తి భరోసా వచ్చే అవకాశమూ లేదనీ, ఎందుకంటే ఏ పార్టీలో అయినా ఆయన ఇమడలేరనీ కేశినేని గురించి బాగా తెలిసినవారంటున్నారు.

బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తెను బరిలోకి దింపిన కేశినేని నాని, పార్టీలో గ్రూపు రాజకీయల కారణంగా దెబ్బతిన్న విషయం విదితమే. వాస్తవానికి బెజవాడ కార్పొరేషన్ టీడీపీ వశం అయి వుండాల్సింది. టీడీపీ నష్టపోయింది.. నాని కూడా నష్టపోయారు ఈ గ్రూపు రాజకీయాల కారణంగానే.