KCR’s Fight With Modi : మోడీపై యుద్ధం ప్రకటించిన కేసీయార్: నమ్మబుద్ధి కావట్లేదు సారూ.!

KCR’s Fight With Modi : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘రాజకీయ యుద్ధం’ ప్రకటించేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేంద్ర మోడీని ఓడించి తీరతామని శపథాలు చేసేస్తున్నారు కేసీయార్. తెలంగాణ సమాజం తలచుకుంటే ఏదైనా సాద్యమేనంటున్నారు. బీజేపీ శ్రేణులకి అల్టిమేటం కూడా జారీ చేసేశారు కేసీఆర్.

మీడియా ముందుకొచ్చి ప్రెస్‌మీట్‌లో ‘బస్తీ మే సవాల్’ అని నినదించినా, బహిరంగ సభల సాక్షిగా ప్రధానికి సవాల్ విసిరినా.. కేసీయార్ మాటల్లో విశ్వసనీయత ఎంత.? అన్న అనుమానమైతే అందరిలోనూ కలుగుతోంది. ఒకప్పటి పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు.

ఒకప్పుడు కేసీయార్ ఆడిందే ఆట తెలంగాణలో. కానీ, ఇప్పుడు సీన్ మారిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన పోటీని తట్టుకోగలిగింది బీజేపీ నుంచి.

ఇవన్నీ చూశాక కేసీయార్ – మోడీ మధ్య మాటల యుద్ధంలో నిజమెంత.? అసలు కేసీయార్‌లో పోరాట శక్తి ఎంత.? అన్నదానిపై సహజంగానే అనుమానాలు ఎవరికైనా కలగొచ్చు. తెలంగాణ సమాజం కూడా కేసీయార్ చేస్తున్న ప్రసంగాల్ని జాగ్రత్తగా గమనిస్తోంది. ప్రధానిపై కేసీయార్ పోరాటం నిజమేనా.? అన్న విషయమై తమ మెదళ్ళకు పదును పెడుతోంది.

పరిస్థితి ఏంటన్నది కేసీయార్‌కి తెలియకుండా వుంటుందా.? అందుకే, తెలంగాణ సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సెంటిమెంట్ రగల్చాలనుకుంటున్నారు. ఆ సెంటిమెంట్ తాను అనుకున్న స్థాయికి పెరిగితే, ముందస్తు ‘సారు’ ఎన్నికల జాతర షురూ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.