గ్రేటర్ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్న వేళ వరదలొచ్చి పెద్ద భీభత్సమే సృష్టించాయి. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల ఫాలియుతాల ముఖ చిత్రాన్ని ఈ వరదలు ఒక్కసారి తలకిందులు చేసేశాయి. అప్పటివరకు 100 గెలుస్తాం అంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్ సైతం సైలెంట్ అయిపోయారు. నగరంలో తిరుగుతూ ఇదంతా మేం చేసిన అభివృద్దే అంటూ చెప్పిన కేటీఆర్ మిన్నకుండిపోయారు. వరదలు మిగిలిచిన ప్రాణ, ఆస్తి నష్టం చూసేసరికి అధికార పార్టీ నగరాన్ని ఎంత అభివృద్ధి చేసిందో జనాలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఇంకేముంది తిరుగుబాటు మొదలైంది. పరామర్శకు పడవలు వేసుకుకి వెళ్లిన తెరాసా నేతలను జనాలు దుమ్ము దులిపేశారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు బయటికి వెళ్లి జనాలను పలకరిస్తే ఎక్కడ ఎదురు తిరుగుతారో అని ఉన్నచోటే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించుకుంటున్నారు. ఇక కార్పొరేటర్ల సంగతి మరీ దారుణంగా ఉంది. వరద ముంపుకు గురైన ప్రాంతాల తెరాస కార్పొరేటర్లు తన కార్పొరేషన్ పరిధిలో తిరగడానికి జంకుతున్నారట. కనిపిస్తే జనం మీద పడిపోయేలా ఉన్నారట. నాలాలు పూడికలు, రోడ్ల వెడల్పు, చిన్నా చితకా చెరువులను పరిరక్షించడం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ ఇలా పలు విషయాల్లో ప్రభుత్వం విఫలమైందని జనం మొహం మీదే కడిగేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లి రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో గెలిపించమని ఎలా అడుగుతాం అంటూ బిక్కుబిక్కుమంటున్నారు.
కొందరైతే ఈసారి గెలబోయేది లేదని ఇప్పటికే నిర్ణయానికి వచ్చేసి బయటకు రావడమే మానేశారట. ఈ బాధలన్నీ అధిష్టానం వద్దకు మోసుకుపోతూ దయచేసి ఎన్నికలను కాస్త వెనక్కి నెట్టి జనంలో ఆగ్రహం తగ్గాక ఓట్లు, ఎన్నికల ప్రస్తావనే తీసుకువెళ్తే బాగుంటుందని, ఇప్పుడు గనుక ఓట్లు అడిగితే చీవాట్లు తినాల్సి వస్తుందని చెబుతున్నారట. ఆగ్రహానికి గురవుతున్న కార్పొరేటర్లు కేసీఆర్ ను ఒప్పించడానికి ఏడవడం తప్ప అన్నీ చేశారట. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇదే మాటను అధిష్టానం వద్ద ప్రస్తావించగా కేసీఆర్ కూడ ఎన్నికలను వెనకు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి. మొత్తానికి హైదరాబాద్ వరదలు తెరాస దూకుడు కళ్లెం వేశాయన్నమాట.