ఇన్నేళ్లు ఏ రాజకీయ పార్టీ మద్దతు కోరని కేసీఆర్ ఇప్పుడు కోరుతున్నారా.. ఆయనకు సహాయం చేసేందుకు ఒక పొలిటికల్ పార్టీ కావాలా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మొదటి దఫాలో ఎలాంటి ఎదురూ లేకుండా పాలన చేసిన కేసీఆర్ రెండో దఫా మొదలై రెండేళ్లు పూర్తయ్యేసేరికి అనూహ్య రీతిలో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. దుబ్బాక మొదలుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కారును కంగారెత్తించింది. ప్రజల్లో తెరాస పట్ల పుట్టిన వ్యతిరేకతను పూర్తిగా క్యాష్ చేసుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీని సైతం వెనక్కు నెట్టి బీజేపీ తెరాసకు ప్రత్యామ్నాయం అనిపించుకుంది అంటే దాని వెనుక ఒక స్ట్రాటజీ ఉంది. అదే వ్యతిరేక ఓట్లను ఏకపక్షంగా పొందగలగడం. బీజేపీ అధిష్టానం మొదటి నుండి తెరాసను టార్గెట్ చేసినట్టే కనబడినా లోపల మాత్రం కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో కనబడకుండా చేసింది.
అందుకే కేసీఆర్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్న ఓటర్లు బీజేపీ వైపు మొగ్గుచూపారు. అదే బీజేపీ లేకపోయి ఉంటే ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ ఖాతాలోనే పడేవి. అంటే ఇక్కడ వ్యతిరేకత ఏకపక్షమైపోయిందని రూఢీ అయింది. ఎప్పుడైనా ప్రత్యర్థుల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది బలంగా ఉన్నప్పుడే పాలక వర్గానికి మేలు జరుగుతుంది. అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు ప్రత్యర్థుల మధ్యన చీలిపోతాయి. అప్పుడు వారిలో ఎవ్వరికీ సంపూర్ణ మెజారిటీ అనేది కనబడదు. సీట్లు తగ్గినా, ఓటు బ్యాంక్ దెబ్బతిన్నా అధికార పార్టీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కనబడుతుంది. ఈ లెక్కే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తప్పింది. బీజేపీ ఒక్కటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గుంజుకుంది. అందుకే దీన్ని మార్చాలని కేసీఆర్ రంగంలోకి దిగారట.
త్వరలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు రానున్నాయి. వీటిలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు మీద కన్నేసింది. ప్రభ్యుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వర్గాల్లో రెడ్డి సామాజికవర్గం కూడ ఉంది. వారు వేరే దారి లేక బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. వారికి బీజేపీ కాకుండా వేరే అప్షన్ చూపించాలని కేసీఆర్ ప్లాన్ చేసి వైఎస్ జగన్‌కు కబురరు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీకి తెలంగాణలో కొద్దో గొప్పో ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో ఒక ఎంపీ, మూడు ఎమెమ్మెల్యే సీట్లు గెలిచింది. ఇప్పుడు ఆ నలుగురు తెరాసలోనే ఉన్నారు అది వేరే విషయం. రెడ్డి సామాజిక వర్గం జగన్ కు ఏ సందర్భంలోనైనా మద్దతు పలకడానికి రెడీ అంటోంది. అందుకే జగన్ చెల్లెలు షర్మిల ద్వారా తెలంగాణలో వైసీపీ కార్యకపాలను తిరిగి మొదలుపెట్టించాలనేది వ్యూహమాట.
అప్పుడు బీజేపీకి మద్దతిస్తున్న రెడ్డి వర్గం పూర్తిగా వైసీపీ వైపుకు మళ్లుతుంది. అప్పుడు వ్యతిరేక ఓట్లలో భారీ చీలిక ఉంటుంది. ఫలితంగా బీజేపీ నష్టపోతుందని, వారి ఓట్ల శాతం సగానికి పడిపోతుంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లానే తీసుకుంటే అది ఏపీకి సరిహద్దులులో ఉంది. అక్కడ రెడ్డి సామాజికవర్గం ఓటర్లు గట్టిగానే ఉన్నారు. వారు బీజేపీ వైపుకు వెళ్ళకుండా ఆపగలిగేది ఒక్క జగన్ మాత్రమే. ఎందుకంటే సరిహద్దు కాబట్టి జగన్ ప్రభావం కనబడవచ్చు. అలాగే మిగతా చోట్ల కూడ చేయాలని, ఈమేరకు కేసీఆర్ నుండి జగన్‌కు కబురు వెళ్లిందని చెప్పుకుంటున్నారు.