ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదు: తేల్చిపారేసిన కేసీయార్ సారు!

2014 ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టి, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, 2018 ఎన్నికల్లోనూ అంతకు మించిన విజయాన్ని అందుకుంది. 2019లో జరగాల్సిన ఎన్నికలు, 2018 చివర్లో జరగడానికి కారణం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే.

మరి, ఈసారి ఏమవుతుంది.? మళ్ళీ ముందస్తు ముచ్చట దిశగా కేసీయార్ పావులు కదుపుతున్నారా.? అంటే, ఈసారి ఆ ముచ్చటే లేదని తేల్చేశారు గులాబీ బాస్. నిజానికి, కేసీయార్ ఎప్పుడు ‘ముందస్తు’ మంత్రం జపిస్తారో తెలియక గులాబీ శ్రేణులు ఎప్పటికప్పుడు కంగారుపడుతూనే వున్నాయ్. ఎన్నికలంటే మాటలు కాదు మరి.

మొత్తమ్మీద, ముందస్తు ముచ్చట లేదని కేసీయార్ తేల్చేయడంతో గులాబీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో సూపర్ విక్టరీ కొట్టబోతున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కేసీయార్ వ్యాఖ్యానించారు.

ఇదిలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి కోసం పార్టీ పరంగా ఎన్నికలు జరగబోతున్నాయ్. కేసీయార్‌ని కాదని ఇంకెవరూ ఆ పదవికి పోటీ చేసే అవకాశం లేదనుకోండి.. అది వేరే సంగతి. ఇది జస్ట్ ఓ లాంఛనం మాత్రమే. కేసీయార్ పేరుని అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తూ నామినేషన్లను గులాబీ పార్టీ ముఖ్య నేతలే వేసేశారు.

కాగా, హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీయార్ మంత్రి వర్గంలో కీలక మార్పులు జరగబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. దాంతోపాటుగా, పార్టీ పరంగానూ కీలక నిర్ణయాల్ని కేసీయార్ తీసుకోబోతున్నారట. జాతీయ రాజకీయాలపైనా కేసీయార్ స్పెషల్ ఫోకస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత పెట్టబోతున్నారనేది గులాబీ శ్రేణుల నుంచి అందుతోన్న సమాచారం.