కేసీయార్ – నరేంద్ర మోడీ మధ్య ‘దోస్తీ’ కుదిరిందా.?

‘దేశ ప్రధానిగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.. ఆయనకు మనమంతా సహకరించాలె..’ అంటూ కరోనా పాండమిక్ నేపథ్యంలో ఫస్ట్ వేవ్ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భారత ప్రధాని నరేంద్ర మోడీ విషయమై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సీన్ మారింది. ‘హెలికాప్టర్ మనీ’ని కేసీయార్ కోరితే, నరేంద్ర మోడీ సర్కార్ లైట్ తీసుకుంది. ‘కేంద్రం సహకరించడంలేదు..’ అంటూ కేసీయార్ అండ్ టీమ్ గుస్సా అవడం మొదలెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి ‘కషాయం’ దెబ్బ గట్టిగా తగిలింది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి. బీజేపీ – టీఆర్ఎస్ మధ్య తెలంగాణలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వుంది. ఇంతలోనే కేసీయార్, ఢిల్లీకి వెళ్ళారు.. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు.. అదీ ముఖ్యమంత్రి హోదాలో. ఈ సందర్భంగానే, ‘కేసీయార్ – మోడీ దోస్తీ’ అనే చర్చ షురూ అయ్యింది.

కేంద్ర మంత్రి వర్గంలో చేరాల్సిందిగా కేసీయార్‌ని ప్రధాని నరేంద్ర మోడీ కోరారట. రాష్ట్రానికి సంబంధించి కొన్ని సమస్యలున్నాయనీ, వాటిని పరిష్కరిస్తే, ‘ఖచ్చితంగా ఆలోచన చేస్తాం..’ అని కేసీయార్, ప్రధానికి హామీ ఇచ్చారట. అయితే, ఇదంతా జస్ట్ ఊహాగానం మాత్రమే. తెలంగాణలో గులాబీ పార్టీతో బీజేపీకి దోస్తీ కుదిరితే అదో సరికొత్త సంచలనమవుతుంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఎవరూ వుండరు. ఇంతకీ, ఈ దోస్తీ కుదిరితే.. ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య ప్రశంసల వ్యవహారమెలా నడుస్తుందో ఒక్కసారి ఊహించుకోండి.? అన్నట్టు, గులాబీ పార్టీ తమ మిత్రుడు అసదుదీన్ ఒవైసీని ఎలా ఒప్పిస్తుందట.? ఇందులో ఒప్పించడానికేముంది.? పైకి బీజేపీతో శతృత్వం.. అని చెబుతున్నా, తెరవెనుకాల బీజేపీకి, మజ్లిస్ రాజకీయ వ్యూహాలు రాజకీయంగా సహకరిస్తూనే వున్నాయ్. సో, అదీ పెద్ద సమస్య కాబోదన్నమాట.