తెరాసలో కేసీఆర్ తర్వాత ఎవరయా అంటే గుర్తొచ్చే పేర్లు కేటీఆర్, హరీష్ రావు. నెంబర్ 2 స్థానం కోసం వీరిద్దరి మధ్యన పెద్ద పోటీయే నెలకొని ఉంది. కేటీఆర్ ఏమో తండ్రి తర్వాత అంతా నేనే అన్నట్టు దూసుకుపోతుంటే హరీష్ రావు మౌనంగానే ఉన్నా పార్టీలో తనకి కేటీఆర్ కంటే ఎక్కువ హక్కే ఉందనే భావనలో ఉంటారు. పోటీ ఎలా ఉన్నా ఈ ఇద్దరు మాత్రం కేసీఆర్ మాటను ఏనాడూ జవదాటలేదు. కేసీఆర్ అయితే హరీష్ రావు కంటే కుమారుడు కేటీఆర్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. కొన్నేళ్లుగా హరీష్ రావును సిద్దిపేటకు పరిమితం చేసిన కేసీఆర్ ఇతర వ్యవహారాలన్నింటినీ కేటీఆర్ చేతిలోనే పెట్టేశారు.
అప్పుడప్పుడు హరీష్ రావుకు అగ్ని పరీక్షలు కూడ పెడుతుంటారు కేసీఆర్. అందుకు నిదర్శనమే దుబ్బాక ఉప ఎన్నికలు. ఏనాడూ కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ మిస్ చేయని హరీష్ ఈసారి మాత్రం విఫలమయ్యారు. దుబ్బాకను గెలుచుకురమ్మని కేసీఆర్ హరీష్ రావును ఒంటరిగానే బరిలోకి నెట్టేశారు. హరీష్ రావు సైతం పూర్తి శక్తి సామర్థ్యాలు ప్రయోగించి పనిచేశారు. ప్రచారంలో, అసంతృప్తులను బుజ్జగించడంలో, ప్రత్యర్థులను ఢీకొట్టడంలో ఒక్కడిగానే పోరాడారు. కేసీఆర్, కేటీఆర్, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆయనకు తోడు రాలేదు. అందుకే కేవలం కొద్దిపాటి తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో హరీష్ ట్రాక్ లిస్టులో ఒక బ్లాక్ మార్క్ పడిపోయింది.
అయితే గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం కుమారుడు కేటీఆర్ కు కేసీఆర్ పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నారు. మొదట్లో సొంతంగానే పనిచేయమని చెప్పినా దుబ్బాక ఫలితాలు చూసి అభిప్రాయం మార్చుకున్నారు. కేటీఆర్ కు తోడుగా మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే క్యాంప్ వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు డివిజన్లను పంచుకుని పనిచేస్తున్నారు. ఇదంతా పెద్ద స్కెచ్. కేసీఆర్ కింద కేటీఆర్, కేటీఆర్ కింద మంత్రులు, మంత్రుల కింద ఎమ్మెల్యేలు. ఇలా క్షేత్రస్థాయి వరకు పెద్ద నాయకులే బాధ్యతలను చూసుకుంటున్నారు. కేసీఆర్ వేసిన ఈ స్కెచ్ విఫలమయ్యే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి దుబ్బాక ఎన్నికల్లో హరీష్ రావు ఎదుర్కొన్నంత ప్రతికూల పరిస్థితులు, కష్టాలు గ్రేటర్లలో కేటీఆర్ కు ఎదురవ్వకపోవచ్చు.