మునుగోడులో ‘ఫ్లాప్ షో’పై ‘హింట్’ ఇచ్చేసిన కేసీయార్.?

బీజేపీకి వచ్చే డిపాజిట్లు తెలంగాణ రాష్ట్ర సమితిని ముంచేస్తాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనడంలో అర్థమేంటి.? ఇప్పుడు టీఆర్ఎస్ శ్రేణుల్ని వేధిస్తోన్న ప్రశ్న. ‘మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది..’ అని ఓ వైపు అంటూనే, బీజేపీకి గనుక డిపాజిట్లు వస్తే, ‘నన్ను పక్కకు తోసేస్తారు..’ అని కేసీయార్ వ్యాఖ్యానించడం పెను ప్రకంపనలు సృస్టిస్తోంది తెలంగాణ రాష్ట సమితిలో.

వాస్తవానికి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితికి తిరుగు లేదు. గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యవహారం వేరు. మునుగోడు ఉప ఎన్నిక గెలుపోటములతో తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా వచ్చే నష్టమూ ఏమీ లేదు.

ఈ విషయంలో కేసీయార్‌కి తెలియకుండా వుంటుందా.? అయినాగానీ, మునుగోడు ఉప ఎన్నికని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేసీయార్. సరే, అధికారంలో వున్నాక ఏ ఉప ఎన్నికని అయినా సీరియస్‌గా తీసుకోవాల్సిందే.. అది వేరే సంగతి.

మునుగోడు స్థానం కాంగ్రెస్ పార్టీది ఒకప్పుడు. కానీ, అక్కడి నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో వున్నారు. ఆయనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారిప్పుడు. కోమటిరెడ్డికి అంత అనుకూలంగా లేదు పరిస్థితి మునుగోడులో.

కానీ, ఎప్పుడైతే కేసీయార్ మునుగోడులో బీజేపీకి డిపాజిట్ వస్తే.. తనకు ఇబ్బంది అన్నట్లు వ్యాఖ్యానించారో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కేసీయార్ భయపడుతున్నారంటే, మునుగోడులో ఏదో జరగబోతోంది.. అది గులాబీ పార్టీ ఓటమి కావొచ్చు.. అన్నది టీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కనిపిస్తోన్న భయమిప్పుడు.